వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సమేతంగా మంత్రి అల్లోల స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేదపండితులు ఆశీర్వచనాలను అందించారు. శివరాత్రి మహోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వామి వారి దివేనతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు. అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అర్చకులు, అధికారులు శ్రీరాజరాజేశ్వరస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ అర్చకులు, అధికారులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి శ్రీవెంకటేశ్వర స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కలెక్టర్ కృష్ణభాస్కర్, ఆలయ ఈవో కృష్ణవేణి, తదితరులు ఉన్నారు.