శ్రీశైలం:
శ్రీశైలం… ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రము. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల్ల అడవులలో కొండగుట్టలమధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము. మెలికలు తిరుగుతూ, లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం అయిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది,అష్టాదశ శక్తి పీఠములలో ఆరవది, మరియు దశ భాస్కర క్షేత్రములలో శ్రీశైలం ఆరవది.
విశిష్టత:
శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయం బాగా ప్రసిద్ధి చెందినది. దీనిలో శివ పార్వతుల విగ్రహాలు వుంటాయి. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడుగా మరియు, మాత పార్వతి దేవిని భ్రమరాంబగా పూజిస్తారు. శివ భగవానుడికి గల 12 జ్యోతిర్ లింగాలలో శ్రీశైలం ఒకటి కావున, హిందువులు ఈ దేవాలయానికి చాల ప్రాముఖ్యతనిచ్చి దర్శనం చేసుకొంటారు. ఇక్కడ కల మల్లెల తీర్థం అనే జలపాతాలలో స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని మోక్షం వస్తుందని భావిస్తారు.
పురాణంలో:
పూర్వం అరుణాసురడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రీ మత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపదాలచే మరియు చతుష్పదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతీ భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమయి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెపుతుంది. తర్వాత దేవతలు పధకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురడు దేవ గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్త పరుచగా, బృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నమని, కాబట్టి ఈరాకలో వింత ఏమి లేదని చెపుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంసాఖ్యకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి.