టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాన ఆర్థికవనరులుగా నిలిచిన కీలక నేతలు బ్యాంకు రుణాల ఎగవేత కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే బీజేపీ ఎంపీ సుజనా చౌదరి 400 కోట్ల రుణాలు ఎగవేయడంతో బ్యాంకు ఆఫ్ ఇండియా ఆయన ఆస్తుల వేలానికి నోటీసులు జారీ చేసింది. తాజాగా మరో టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ఆస్తులను వేలం వేస్తున్నట్టు ఆంధ్రాబ్యాంక్ ప్రకటించింది. ఈ మేరకు సదరు బ్యాంక్ పత్రికా ప్రకటన జారీ చేసింది. రాయపాటి ఏకంగా రూ.837.37 కోట్ల విలువైన రుణాలు బకాయి పడటంతో గుంటూరు, న్యూఢిల్లీలోని ఆయనకు సంబంధించిన ఆస్తులను మార్చి 23న వేలం వేస్తున్నట్లు ఆంధ్రా బ్యాంక్ ప్రకటించింది. గుంటూరు అరండల్‌పేటలోని 22,500 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉన్న వాణిజ్య భవనంతో పాటు, న్యూఢిల్లీలోని ఫ్లాట్‌ను వేలం వేస్తున్నట్టు తెలిపింది. గుంటూరు భవనం ఆస్తి విలువను రూ.16.44 కోట్లుగాను, ఢిల్లీలోని ఫ్లాట్ విలువను రూ.1.09 కోట్లుగా నిర్ధారించింది. అయితే సుజనా చౌదరి ఆస్తులను కూడా అదే మార్చి 23 న వేలం వేస్తున్నట్లు బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రకటించడం గమనార్హం. ఆంధ్రాబ్యాంకు నుంచి ఈ రుణాన్ని రాయపాటి తన సంస్థ ట్రాన్స్ట్రాయ్ ఇండియాతో పాటు, చెరుకూరి శ్రీధర్, మల్లినేని సాంబశివరావు, రాయపాటి రంగారావు, దేవికారాణి, లక్ష్మి పేరిట తీసుకున్నారు. ఈ రుణానికి గ్యారంటెర్లుగా రాయపాటి జగదీష్, రాయపాటి జీవన్, నారయ్యచౌదరి, రంగారావు, దేవికారాణి, లక్ష్మి, సీహెచ్ వాణి, జగన్మోహన్ యలమంచలి ఉన్నారు. మిగిలిన వివరాల కోసం ఆంధ్రాబ్యాంక్ వెబ్సైట్ లేదా టెండర్స్ డాట్ గవ్ డాట్ ఇన్ను సంప్రదించాల్సిందిగా ప్రకటనలో ఆంధ్రా బ్యాంక్ పేర్కొంది. రుణాల చెల్లింపులపై ఇన్నాళ్లు ఓపిక పట్టిన బ్యాంకులు సరైన టైమ్‌లో రంగంలో దిగి.. ఒకే రోజు చంద్రబాబుకు ఆర్థిక వనరులుగా నిలిచిన సుజనా చౌదరి, రాయపాటి సాంబశివరావుల ఆస్తులను వేలం వేయడం సర్వత్రా హాట్‌టాపిక్‌గా మారింది. మొత్తంగా ఒకవైపు ఐటీ దాడులు, మరో వైపు ఆస్తుల వేలంతో బాబు బ్యాచ్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
