విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘భారతీయుడు-2’ షూటింగ్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై సమీపంలోని పూంతమల్లి పక్కన ఉన్న నజరత్పేట్లోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా సెట్లో ఒక్కసారిగా క్రేన్ క్రాష్ అయ్యింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈఘటనపై కమల్ విచారం వ్యక్తంచేశారు.
ప్రమాదంపై ట్విట్టర్లో ఆయన స్పందించారు. ఈ ఘటన తన మనసును కలచివేసిందని, ముగ్గురు సహాయకులను కోల్పోవడం బాధాకరమని ట్వీట్ చేశారు. తన బాధ కన్నా వారి కుటుంబాల బాధ ఎన్నో రెట్లు ఎక్కువని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు.