ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై దృష్టిపెట్టారు. ప్రకాశం జిల్లా వరప్రదాయని, జీవధార అయిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. తాజాగా పెద్దదోర్నాల మండల పరిధిలోని కొత్తూరు వద్ద నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను సీఎం జగన్ పరిశీలించారు. సీఎం జగన్ స్వయంగా ప్రాజెక్ట్ మొదటి టన్నెల్, రెండో టన్నెల్ లోపలికి వెళ్లి పనులను పరిశీలించి, ప్రాజెక్ట్ పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. . ప్రకాశం జిల్లాతోపాటు కడప, నెల్లూరు జిల్లాల్లో దాదాపు 4,47,300 ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలనే తలంపుతో సీఎం జగన్ ఇవాళ వెలిగొండ ప్రాజెక్ట్‌ను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్ వద్దే జిల్లా ఉన్నతాధికారులు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణమ్మ వరద నీటిని మళ్లించి సాగు, తాగునీరు అందించే విధంగా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. ప్రకాశం జిల్లాలో 23 మండలాల పరిధిలో 3,36,100 ఎకరాలకు సాగునీరు, వైఎస్సార్ జిల్లాలోని రెండు మండలాల పరిధిలో 27,200 ఎకరాలు, నెల్లూరు జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో 84వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. మూడు జిల్లాలకు కలిపి 15.25 లక్షల మంది జనాభాకు తాగునీరు అందించేందుకు ప్రాజెక్టు డిజైన్ తయారు చేశారు. జూన్‌కల్లా ఒకటో సొరంగం నుంచి నీటి విడుదల చేసేదిశగా పనులను వేగవంతం చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా పోలవరంతో సహా, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నింటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం జగన్ కంకణం కట్టుకున్నారు. సీఎం జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లామంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో పాటు, స్థానిక నేతలు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
