తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడికి దేశంలోనే అతి తక్కువమండికి ఇచ్చే అత్యంత ఎక్కువ భద్రత కల్పిస్తున్నట్లు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ప్రస్తుతం జెడ్ ప్లస్ కేటగిరి కింద ఆయనకు సెక్యురిటీ ఇస్తున్నామని, మొత్తం 183మందితో భద్రత ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విజయవాడలో 135 మంది, హైదరాబాద్లో 48 మందితో ఆయన భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. మరోవైపుతనకు భద్రత తగ్గించారని చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు.
చంద్రబాబుకు భద్రతలో ఎలాంటి మార్పులు చేయలేదని, ఒక్కరిని కూడా తగ్గించలేదని స్పష్టంచేశారు. ఆర్నెళ్లకొకసారి ఇలాంటి ఆరోపణలు చేయటం ఆపార్టీ నాయకులకు అలవాటుగా మారిందని,ప్రజల్లో సానుభూతికోసం చవకబారు ఆరోపణలు చేస్తున్నారని సుచరిత మండిపడ్డారు. చంద్రబాబు తన మాజీ వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో ఆదాయ పన్నుశాఖ జరిపిన సోదాల గురించి మాట్లాడరు గానీ ఇలాంటి ఆరోపణలు మాత్రం చేస్తుంటారని, చంద్రబాబు కోరితే ఆయనకు మరింత భద్రతను పెంచటానికి సిద్ధమని ప్రకటించారు. మరోవైపు ప్రజా చైతన్య యాత్ర లో ఉన్న చంద్రబాబు తనకు భద్రత తగ్గించారంటూ ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు.