కేంద్రం తీసుకొస్తున్న సీఏఏకి సంబంధించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కూడా సిద్ధమేనని ఆయన ప్రకటించారు. వైసీపీ పార్లమెంట్ లో కేంద్రానికి మద్దతు ఇచ్చినప్పుడు ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లు లేవని తెలిపారు. పార్లమెంట్‌లో ఈబిల్లుకు మద్దతు ఇచ్చినప్పుడే తమవైఖరి స్పష్టంగా ప్రకటించినట్లు గుర్తుచేశారు. దేశభద్రత, చొరబాట్లు, అక్రమ వలసల నిరోధం విషయంలోనే సీఏఏ బిల్లుకు వైసీపీ మద్దతు ఇచ్చిందని, ఆ తర్వాత ఎన్‌ఆర్‌సీ అంశం వచ్చిందని తెలిపారు. ముస్లిం మైనార్టీలు ఆందోళన విషయంలో ప్రభుత్వం పూర్తి అవగాహనతో ఉందని, వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎలాంటి ఇబ్బందులు రానివ్వమని హామీ ఇచ్చారు. చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని కాబట్టి సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. అవసరమైతే సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్నారు సజ్జల.