అసెంబ్లీ కార్యదర్శిపై శాసన మండలి చైర్మన్ కక్ష సాధింపు దోరణితో వ్యవహరిస్తున్నారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. అసెంబ్లీ సెక్రటరీ నిబంధనల ప్రకారం నడుచుకున్నారని తెలిపారు. ఆయన్ను బెదిరించడం, మానసిక ఒత్తిడి చెయ్యడం సమంజసం కాదని హితవు పలికారు. కొన్ని పత్రికలు, పార్టీలు అసెంబ్లీ సెక్రటరీని బెదిరిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో ఉద్యోగ సంఘాల భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మండలి చైర్మన్ తీరుపై సీఎస్‌కు ఫిర్యాదు చేసినట్టు ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి తెలిపారు.‘మేమంతా అసెంబ్లీ సెక్రటరీకి మద్దతుగా ఉంటాం. అవసరమైతే గవర్నర్‌ని కూడా కలుస్తాం. సెలెక్ట్ కమిటీని రూల్స్‌కి విరుద్ధంగా వేస్తున్నానని చైర్మన్ గారే చెప్పారు .మోషన్ ఇవ్వకుండా, ఓటింగ్ జరగలేదు. మరి ఎలా సెలెక్ట్ కమిటీ వేస్తారు. అందుకే అసెంబ్లీ సెక్రటరీ ఆమోదించలేదు. ఏ అధికారయినా రూల్ ప్రకారమే పని చేయాలి. మేమందరం నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తాం. అధికారుల జోలికి వస్తే చూస్తూ ఊరుకోం. రూల్స్ లేవు ఏమీ లేవని యనమల, బొండా ఉమా మాట్లాడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మిమ్మల్ని జైల్లో వేయమంటారా. అలా చేస్తే ఎవరైనా సమర్థిస్తారా’అని వెంకట్రామిరెడి పేర్కొన్నారు
