టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజా చైతన్య యాత్రపై వైసీపీ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తాజాగా టీడీపీ ప్రజా చైతన్యయాత్రపై టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. తూర్పుగోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ…ఇది ప్రజా చైతన్య యాత్ర కాదని… చంద్రబాబు నయవంచన యాత్ర అని వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఈ నయవంచనయాత్రను ప్రజలు నమ్మద్దని కోరారు. అలాగే గత ఐదేళ్లలో జరిగిన అక్రమాలపై ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని వైవి డిమాండ్ చేశారు. ఐటీ దాడులతో టీడీపీ నేతల అసలు స్వరూపం బయట పడిందని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా ఏ మొహం పెట్టుకొని యాత్రలని బయలుదేరావని చంద్రబాబును వైవి ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఉనికి కాపాడుకునేందుకు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం వైయస్ జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, నవరత్నాలు, ప్రజలకు ఇచ్చిన హామీలే కాకుండా చెప్పనివి కూడా అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజల మేలు, రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ కృషిచేస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్‌ఆర్ సీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పని చేసే ప్రభుత్వంపై కుటిల రాజకీయాలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబుకు ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.
