ప్రముఖ వ్యాపారవేత్త, కేసీపీ సంస్థల అధినేత వెలగపూడి లక్ష్మణదత్ కన్నుమూశారు. చెన్నై ఎగ్మోర్లోని స్వగృహంలో గుండెపోటుతో మృతిచెందారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు.. లక్ష్మణదత్కు భార్య ఇందిర దత్, కుమార్తె కవిత ఉన్నారు. డిసెంబర్ 27, 1937న జన్మించిన ఆయన మద్రాసు తెలుగు సమాఖ్య ఏర్పాటులో క్రియాశీలపాత్ర పోషించారు. రాష్ట్ర పారిశ్రామికీకరణలో కీలక పాత్ర పోషించారు. 1989లో ఆయనను యాజమాన్య రత్న పురస్కారంతో ప్రభుత్వం గౌరవించింది. 1991 లో నాగార్జున యూనివర్సిటీ డాక్టర్ ఆఫ్ లెటర్స్ డిగ్రీని ప్రదానం చేసింది. ఆయన గతంలో ఫిక్కీ అధ్యక్షుడిగా సేవలందించారు. కృష్ణాజిల్లా ఉయ్యూరు, గుంటూరు జిల్లా మాచర్ల, చెన్నైలో కేసీపీ పరిశ్రమలను స్థాపించారు.
దత్ మృతి పారిశ్రామిక రంగానికి తీరని లోటుని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. మరణవార్త తెలిసిన అనంతరం ఆ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. దత్ మృతి భారత పారిశ్రామిక రంగానికి తీరని లోటన్నారు. గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్య రంగాల్లో వీఎల్ దత్ సేవలు మరవలేమన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడుల విదానంలో ఆయన నిష్ణాతుడని కొనియాడారు. వీఎల్ దత్ మరణం పట్ల చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. పరిశ్రమల అభివృద్ధికి ఎనలేని సేవ చేశారని కొనియాడారు. పల్నాడు, ఉయ్యూరులో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. సామాజిక సేవ, భాషాభివృద్ధికి దత్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.