ఢిల్లీ ఎన్నికల ఫలితాలను దేశమంతా ఆసక్తితో వీక్షించింది. ఆప్ గెలుపుతో ఓవైపు సంబరాలు చేసుకున్న ప్రజలు.. మరోవైపు ప్రధాని మోదీతోపాటు బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలిచే శక్తుల గురించి చర్చ మొదలైంది. రాజ్‌దీప్ సర్దేశాయ్ లాంటి జర్నలిస్టులు ఫెడరల్ ఫ్రంట్ అంటూ విశ్లేషించారు. ఈ ఫ్రంట్‌కు ఎవరు నాయకులు అవ్వగలరనుకున్నప్పుడు అన్ని కారణాలు, బలాలు స్పష్టంగా ఒకేవైపు సూచిస్తున్నాయి.
దశాబ్దాలుగా దేశంలో రెండు పార్టీల పెత్తనాన్ని చూశాం. జాతీయ శక్తులుగా చెప్పుకొనే ఈ రెండు పార్టీలు మూడో శక్తిని ఎదగనివ్వలేదు. ఇప్పుడు ఆ మూడవ శక్తులే రాష్ట్రాల్లో విజయకేతనాన్ని ఎగరేస్తున్నాయి. దీంతో ఆ రెండు జాతీయ పార్టీలు పలు కీలక రాష్ర్టాల్లో ఉనికి కోసం తంటాలు పడుతున్నాయి. ఈ రెండు జాతీయ పార్టీల్లో ఒకటైన బీజేపీకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అసెంబ్లీల్లో అసలు ప్రాతినిధ్యమే లేదు. తెలంగాణలో 1, కేరళలో 1, పంజాబ్‌లో 2, ఢిల్లీలో 8 సీట్లతో సరిపుచ్చుకొన్న ఆ పార్టీ మరికొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయపార్టీల మద్దతులేకుండా అధికారంలో ఉండే అవకాశమేలేదు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోలేక చేతులెత్తేసింది. కాంగ్రెస్ నాయకులు రాహుల్‌గాంధీని దాటి ఆలోచించలేకపోతున్నారు. బీజేపీ కూడా జాతీయ ఎన్నికల్లో రాహుల్‌గాంధీని ప్రత్యర్థిగా ఎంచుకొని రెండు లోక్‌సభ ఎన్నికల్లో సునాయాసంగా గెలిచింది. కానీ రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితి లేదు. సమర్థ నాయకత్వం, అనుభవం, ప్రజాబలం ఉన్నచోట బీజేపీ దారుణ పరాజయాలను చూస్తున్నది. అలాంటి నాయకులందరినీ ఏకంచేసి సైద్ధాంతిక, విప్లవాత్మక పోరాటం చేసేందుకు కావలసిన అర్హతలేమిటి? అవి ఎవరికి ఉన్నాయి? అని విశ్లేషించుకొంటే..
అనుభవం
ఇప్పటివరకు మంత్రిగా పనిచేయని రాహుల్‌గాంధీ ఒక్క రాష్ట్రంలో కూడా కాంగ్రెస్‌ను గెలిపించలేదు. అందుకే ఆయన అనుభవం సరిపోవట్లేదు. నితీశ్‌కుమార్‌కు అనుభవమున్నప్పటికీ బీజేపీ కూటమిలో చేరిన తర్వాత ఆయన పట్ల విశ్వసనీయత దెబ్బతిన్నది. గతంలో నితీశ్‌కు ఉన్న ప్రజాదరణ ఇప్పుడు లేదు. మాయావతికి ప్రస్తుతం అధికారంలేదు. సంఖ్యా బలం కూడా అంతగా లేదు కాబట్టి ఆమె మొదట తన సొంత రాష్ట్రంలో బీఎస్పీని చక్కదిద్దుకోవాలి. చక్రం తిప్పుతానన్న చంద్రబాబునాయుడు చతికిలపడ్డాడు. నవీన్‌పట్నాయక్ ఒడిశా తప్ప వేరే రాజకీయాలపై పెదవి విప్పటంలేదు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీని దాటి చూసేటట్టు కనిపించడంలేదు. హేమంత్‌సోరేన్ యువకుడు. తొలిసారి సీఎంలైన జగన్మోహన్‌రెడ్డి, ఉద్ధవ్‌ఠాక్రే అంతగా ఆలోచించే పరిస్థితి కనిపిస్తలేదు. గతంలో మోదీ కూడా ముఖ్యమంత్రే. ప్రస్తుత నాయకుల్లో అలాంటి అనుభవం శరద్‌పవార్, కేసీఆర్, మమతా బెనర్జీకే ఉన్నది.
వాక్చాతుర్యం
మోదీ గొప్ప ఉపన్యాసాలివ్వగలరని అందరికీ తెలుసు. ఆయన్ను అధిగమించాలంటే భాషపై ప్రావీణ్యత, విశేషమైన పట్టు, నిజానిజాలను లోతులో అధ్యయనం చేయగల సత్తా కలిగి ఉండటంతోపాటు ప్రజల ఆసక్తిని గమనించి వారిని ఆకర్షించడం చాలా అవసరం. అనారోగ్యం వల్ల పవార్ మాట్లాడలేరు. ఫైర్ బ్రాండ్‌గా పేరుపొందిన మమతా దీదీ ఏ భాష మాట్లాడినా అందులో బెంగాలీ ఆనవాళ్లు కనిపిస్తాయి. కేసీఆర్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూలో అనర్గళంగా మాట్లాడగలుగుతారు.
సామర్థ్యం
ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతూ కొన్నినెలల క్రితం ధర్నాలకు దిగి కేంద్రంతో కయ్యం పెట్టుకొన్న మమతా బెనర్జీ.. శారదా కుంభకోణ నిందితులకు రక్షణగా నిలబడ్డారు. ఆ సమయంలో మిగిలిన ప్రాంతీయ పార్టీలు మమతకు అండగా నిలిచేందుకు తటపటాయించాయి. ఈ చర్యలన్నీ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బలపడేందుకు పరోక్షంగా దోహదం చేశాయి. త్వరలో జరుగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీకి బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశమున్నది. కానీ సీఎం కేసీఆర్ ఇప్పటికే తన సామర్థ్యాన్ని నిరూపించుకొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం దేశంలోని పలు పెద్ద, చిన్న పార్టీలను కలిసి మద్దతు కూడగట్టిన ఆయన అందరినీ ఏకం చేయగలనని రుజువు చేశారు.
రాష్ర్టంలో సుస్థిర ప్రభుత్వం
ఒక ప్రాంతీయ పార్టీ ఢిల్లీలో పాగావేయాలంటే తొలుత సొంత రాష్ర్టంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఉండటం అవసరం. నాయకుడు కేంద్రంవైపు అడుగులువేస్తే రాష్ట్రాన్ని నడపడానికి సమర్థ నాయకత్వం ఉండాలి. ఆ అవకాశం మమతాబెనర్జీకి లేదు. వాస్తవానికి టీఆర్‌ఎస్ మినహా అనేక ప్రాంతీయ పార్టీల్లో ఇదే పరిస్థితి ఉన్నది. కేసీఆర్ ఢిల్లీ రాజకీయాల్లో అడుగుపెడితే తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపేందుకు టీఆర్‌ఎస్‌లో సమర్థ నాయకత్వం సిద్ధంగా ఉన్నది.
కారణం
ఒక ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాలపై దృష్టిసారించడం రాత్రికి రాత్రే సాధ్యంకాదు. కేంద్ర ప్రభుత్వ విధివిధానాలపై లోతుగా మాట్లాడటం. దేశానికి సంబంధించి ఓ విజన్ డాక్యుమెంట్‌ను కలిగి ఉండటం, అజెండాను సెట్ చేసుకోవడం అవసరం. ఇప్పుడు దేశంలో బీజేపీ పాలనపై రెండు వాదనలు ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ఒకటి బీజేపీయేతర రాష్ట్రాల పట్ల పక్షపాతం. మరొకటి దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష. తమిళనాడులో జయలలిత మరణానంతరం అధికార ఏఐఏడీఎంకే పెద్దదిక్కును కోల్పోయి బీజేపీకి కీలుబొమ్మగా మారింది. దీంతో డీఎంకే అధినేత స్టాలిన్ తమిళనాడు పీఠంపై దృష్టిసారించారు. ప్రస్తుతం కర్ణాటకకు పరిమితమైన మాజీ ప్రధాని దేవెగౌడ ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడంలేదు.
పినరయి విజయన్ కేరళ దాటి రాజకీయాలపై దృష్టిపెట్టడంలేదు. కానీ వినూత్న వ్యవసాయ పథకాలు, తాగు, సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామిక అభివృద్ధితో తెలంగాణను ప్రగతిపథంలో పరుగులు తీయిస్తున్న సీఎం కేసీఆర్ దేశానికి దిక్సూచిలా నిలిచారు. దేశాన్ని కుదిపేస్తున్న అన్ని సమస్యలపైనా లోతుగా అవగాహన కలిగి ఉన్నది కేసీఆర్ మాత్రమే.One Week is longtime in politics అని అంటారు. జార్ఖండ్, హర్యానా, మహారాష్ర్ట శాసనసభ ఎన్నికలతోపాటు కొద్ది రోజుల క్రితం వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గమనిస్తే బీజేపీ గ్రాఫ్ నానాటికీ పతనమవుతున్నట్టు స్పష్టమవుతున్నది. దీంతో రానున్న రోజుల్లో ఫెడరల్ ఫ్రంట్ బలపడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ 66వ ఏట కేసీఆర్‌ను రాష్ట్ర ప్రజానీకం ఆశీర్వదిస్తూ.. తెలుగుబిడ్డగా, తెలంగాణ నేల కన్న ఆణిముత్యంగా ఆయన ఢిల్లీవైపు అడుగులు వేయాలని ఆకాంక్షిస్తున్నది.
Tags kcr ktr slider telangana governament telanganacm telanganacmo trs governament