తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి చిత్తూరు టౌన్‌బ్యాంకు చైర్మన్ షణ్ముగం. బ్యాంకును బురిడీకొట్టించి గిల్టు నగలతో రుణాలు తీసుకున్నాడంటూ 420 కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఆయనకు చెందిన రెండు ఇళ్లు, రెండు కార్లను సీజ్ చేశారు. నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టుకునే క్రమంలో మాజీ చైర్మన్‌కు సహకరించిన బ్యాంకు అప్రైజర్ ధరణీసాగర్‌ను నేడోరేపో అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ ఈశ్వరరెడ్డి విలేకరులకు వివరించారు.
చిత్తూరు నగరంలోని సహకార టౌన్ బ్యాంకుకు మూడు శాఖలున్నాయి. వీటిలో దర్గా బ్రాంచ్ మేనేజరు పిఆర్.సుబ్రమణ్యం పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఫిర్యాదులో.. ‘‘2014 నుంచి టౌన్ బ్యాంకు చైర్మన్‌గా షణ్ముగం కొనసాగుతున్నాడు. 2016–17వసంవత్సరంలో షణ్ముగం తనకు సంబంధించిన 12 మంది వ్యక్తులతో గిల్టు నగలు కుదువపెట్టాడు. అప్రైజర్ జీఎం.ధరణీసాగర్‌ను బెదిరించి 39 ఖాతాల్లో రుణాలు తీసుకున్నాడు. నన్ను గత ఏడాది 18వ తేదీ బదిలీ చేయించాడు. కొత్త మేనేజరుకు లెక్కలు చెప్పడానికి కుదువలో ఉన్న ఆభరణాలు పరిశీలిస్తే అవి నకిలీవని తేలింది. అప్రైజర్‌ను నిలదీయగా షణ్ముగం తనను బెదిరించి, ఉద్యోగం నుంచి తీసేస్తాని చెప్పి రుణాలు తీసుకున్నాడని చెప్పాడు. దీంతో నేను, అప్రైజర్ కలిసి షణ్ముగంను సంప్రదించాం. చైర్మన్‌గా నేనుండా మీకెందుకు భయం..? ఏదైనా సమస్య వస్తే నా ఆస్తులు అమ్మైనా డబ్బులు కట్టేస్తా అని మమ్మల్ని మభ్యపెట్టాడు. మాకు భయంవేసి పలు మార్లు షణ్ముగంను నిలదీస్తే ఇందులో నాకు సంబంధం లేదని, ఏంచేస్తారో చేసుకోండి అంటూ అడ్డం తిరిగి బెదిరింపులకు గురిచేస్తున్నాడు. ఇతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.’’ అంటూ మేనేజరు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో నిందితుడి కోసం గాలించిన పోలీసులు మంగళవారం చిత్తూరు శివారులోని రెడ్డిగుంట చెక్‌పోస్టు వద్ద షణ్ముగంను అరెస్టు చేశారు.అంతేకాకుండా తిరుపతి, బంగారుపాళ్యం, చిత్తూరు పోలీసు స్టేషన్ల పరిధిల్లో పలు కేసులు నమోదు అయినట్లు డీఎస్పీ చెప్పారు.