వైఎస్సార్ కంటి వెలుగు మూడో విడత ప్రారంభోత్సవ సభలో ఓ చిన్నారి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. కర్నూలులో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న జ్యోతిర్మయి అనే చిన్నారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ‘మామయ్యా’ అంటూ సంబోధించి ప్రసంగించింది. కర్నూలులోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న జ్యోతిర్మయి విద్యా వ్యవస్థలో సంస్కరణలు, అమ్మ ఒడి పథకంతో ప్రభుత్వ బడుల్లో చదువు పట్ల ఆసక్తి పెరిగిందని చెప్పింది. ‘ఇంత గొప్ప పని చేసినందుకు మన సీఎం మామయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేటి సమాజంలో మహిళలకు, బాలికలను రక్షణ కరువైంది. ఒక అన్నలా, తమ్ముడిలా, తండ్రిలా, మామయ్యాలా ఆలోచించి దిశ పోలీస్ స్టేషన్లను ప్రవేశ పెట్టారు. ఆడవాళ్లనే కాకుండా నాలాంటి పేద విద్యార్థులకు రక్షణ కల్పించారు. ఆడవాళ్లందరి తరపున మన మామయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే, మన కర్నూలును న్యాయ రాజధానిగా ఎంచుకున్నందుకు మన మామయ్య గారికి మనమెంతో రుణపడి ఉండాలి’అని జ్యోతిర్మయి పేర్కొంది. చిన్నారి ప్రసంగానికి సీఎం వైఎస్ జగన్ ముగ్ధుడయ్యారు. ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.
