రాష్ట్రంలో ఇదివరకెన్నడూ జరగని విధంగా తొలిసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో 60 ఏళ్లు, ఆ పై వయసున్న 56,88,420 మంది అవ్వాతాతలకు వారు ఉంటున్న గ్రామ, వార్డుల్లోనే డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకం మూడో విడత కింద కంటి పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఉచితంగా కంటి పరీక్షలు, కంటి ఆద్దాలను ఇవ్వడమే కాకుండా, అవసరమైన వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయించనుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం కర్నూలులో ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రాథమిక, సెకండరీ స్క్రీనింగ్ కంటి పరీక్షలను సమాంతరంగా ప్రారంభించి జూలై 31వ తేదీ నాటికి పూర్తి చేస్తారు. అద్దాలు అవసరమైన వారికి సెకండరీ స్క్రీనింగ్ పూర్తయిన తర్వాత పక్షం రోజుల్లో వలంటీర్ల ద్వారా పెన్షన్లతో పాటు కళ్ల జోళ్లను కూడా అందజేయనున్నారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారిని ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తారు. మార్చి 1వ తేదీ నుంచి గుర్తించిన ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు చేయిస్తారు. తొలుత 175 నియోజకవర్గాల్లో ఒక్కో మండలాన్ని ఎంపిక చేసి.. గ్రామ, వార్డు సచివాలయాల్లో అవ్వాతాతలకు కంటి పరీక్షలు పూర్తి చేస్తారు. ఆ తర్వాత మరో మండలంలో పూర్తి చేస్తారు. ఇలా అన్ని మండలాల్లో కంటి పరీక్షలను నిర్వహించనున్నారు.