ఏపీలో 2 వేల కోట్ల స్కామ్‌పై గత నాలుగు రోజులుగా రాజకీయ రగడ కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య విమర్శ, ప్రతి విమర్శలతో ఏపీ రాజకీయం వేడెక్కుతోంది. 2 వేల కోట్ల స్కామ్‌లో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లపై విచారణ జరపాలని…వైసీపీ నేతలు డిమాండ్ చేస్తుంటే..మాజీ పీఎస్‌పై ఐటీ దాడులకు, చంద్రబాబుకేం సంబంధమని టీడీపీ నేతలు బుకాయిస్తున్నారు. తాజగా 2 వేల కోట్ల స్కామ్‌పై వైసీపీ సీనియర్ నేత, శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.
అవినీతికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచే చంద్రబాబు బండారం… అతని వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ ఆస్తులపై ఆదాయపు పన్నుశాఖ జరిపిన దాడులతో బట్టబయలైందని కిల్లి కృపారాణి అన్నారు. రెండు వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదన ఉన్నట్లుగా ఆధారాలు లభించడంతో చంద్రబాబు తన పీఎస్‌ను బినామీగా పెట్టుకొని ఎలా అవినీతి జరిపారో తేటతెల్లమైందన్నారు. ఈ విషయంలో టీడీపీ నేతలు రెండు నాలుకల ధోరణితో మా ట్లాడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. తన ప్రభుత్వ హయాంలో అవినీతిలో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని కృపారాణి మండిపడ్డారు. ఒక్క పీఎస్ అక్రమ సంపాదనే ఈ స్థాయిలో ఉంటే మరి చంద్రబాబు అక్రమార్జన ఏ స్థాయిలో ఉంటుందో ప్రజలకు అంతుపట్టడం లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి పేరుతో రూ.2.50 లక్షల కోట్లు అప్పులు చేసి శాశ్వత ప్రాతిపదికన ఒక్క పని కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు.
ఇక చంద్రబాబు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లేందుకు సమయం ఆసన్నమైందని ఫైర్ అయ్యారు… శ్రీనివాస్‌కు తనకు ఎటువంటి సంబంధం లేదని చంద్రబాబు చెబుతుంటే సామాన్య ప్రజలు సైతం నవ్వుకుంటున్నారన్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై 11 కేసులుంటే న్యాయవ్యవస్ధలను మేనేజ్ చేసుకుని స్టేలు తెచ్చుకుని కోర్టులకు హాజరవ్వకుండా ఐదేళ్లు గడిపేశారని ఇప్పుడా పప్పులుడకవని ఆమె అన్నారు. రాజధానిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ చేసి రియల్ వ్యాపారం చేసుకుని వేలాది ఎకరాల భూముల్ని అనవసరంగా తీసుకున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నిజంగా ఎటువంటి అవినీతి చేయకుంటే సీబీఐ విచారణను బహిరంగంగా ఆహ్వానించాలని కిల్లి కృపారాణి సవాలు విసిరారు. మరి కిల్లి కృపారాణి సవాలుకు చంద్రబాబు, టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.