భూవివాదాలకు ఏమాత్రం ఆస్కారంలేని విధంగా రెవెన్యూ సంస్కరణల అమలు దిశగా శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పూర్తిస్థాయిలో భూ రికార్డుల ప్రక్షాళన (స్వచ్ఛీకరణ)కు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రతి రెవెన్యూ గ్రామానికి ముగ్గురితో బృందాలను నియమించింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత దోషరహిత రికార్డుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర రీసర్వేని చేపట్టనుంది. 120 ఏళ్ల క్రితం బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా భూములను సర్వే చేసి రీసర్వే రిజిష్టర్ (ఆర్ఎస్ఆర్) తయారు చేశారు. నేటికీ ఇదే ప్రామాణికంగా ఉంది. ప్రతి 30 ఏళ్లకు రీసర్వే చేయాల్సి ఉన్నప్పటికీ గత పాలకులు పట్టించుకోలేదు.
తరాలు మారడం, కుటుంబాలు విడిపోవడం తదితర కారణాలతో భూములు చేతులు మారడంవల్ల గత 120 ఏళ్లలో భూముల పరంగా చెప్పలేనన్ని మార్పులు జరిగాయి. ప్రభుత్వ భూములకు దరఖాస్తు పట్టాలు (డీకేటీలు) ఇవ్వడంవల్ల సబ్డివిజన్లు/ సర్వేనంబర్లు పెరిగిపోయాయి. భూమి హద్దుల విషయంలోనూ వివాదాలు పెరిగాయి. చాలాచోట్ల ప్రభుత్వ భూములు ఆక్రమణలపాలయ్యాయి. వాస్తవంగా ఉన్న భూమికీ, రెవెన్యూ రికార్డుల్లో ఉన్న దానికీ మధ్య లక్షల ఎకరాల తేడా ఏర్పడింది. భూరికార్డులు సక్రమంగా లేనందున సివిల్ కేసుల్లో భూ వివాదాలకు సంబంధించినవే 60 శాతంపైగా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. రికార్డుల స్వచ్ఛీకరణ, భూముల రీసర్వే, శాశ్వత భూ హక్కుల కల్పనే ఇలాంటి సమస్యలకు ఏకైక పరిష్కార మార్గమని నిపుణులు చెప్పడంతో శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ చర్యలకు సాహసోపోత నిర్ణయాలు తీసుకుంది.