మొత్తం 40.82 లక్షల మెట్రిక్ టన్నుల నాణ్యమైన బియ్యం కోసం ఏపీ ప్రభుత్వం రూ.7,425 కోట్లు ఖర్చు పెట్టింది. ఒకవైపు రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించడం, మరోవైపు అదే ధాన్యాన్ని మర ఆడించి పేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.. ఇందులో భాగంగా నాణ్యమైన రకం బియ్యానికి సంబంధించిన ధాన్యాన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో 1,710 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. తద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు పంపి మర ఆడించాక 5, 10, 15, 20 కిలోల్లో ప్రత్యేక బ్యాగుల ద్వారా లబ్ధిదారులకు ఇంటింటా పంపిణీ చేయనున్నారు. వీటి కోసం 30 చోట్ల 99 నాణ్యమైన బియ్యం ప్యాకింగ్ యూనిట్లను కొత్తగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక రబీ, ఖరీఫ్ సీజన్లలో రైతులు పండించిన ధాన్యాన్ని సేకరిస్తే 28.74 లక్షల టన్నుల నాణ్యమైన బియ్యం అందుబాటులోకి వస్తుందని అధికారులు అంచనా వేశారు.
