టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో రెండు వేల కోట్ల స్కామ్ బయటపడడంతో ఏపీలో రాజకీయ రగడ మొదలైంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. మరోవైపు 2 వేల కోట్ల స్కామ్‌లో తమ కుల ప్రభువు చంద్రబాబు ఎక్కడ ఇరుక్కుపోతాడో అన్న భయంతో ఎల్లోమీడియా కంగారుపడుతోంది. అసలు ఐటీ దాడుల్లో బయటపడింది..2 లక్షలే అని…2 వేల కోట్లు అని ప్రచారం చేసి వైసీపీ బోల్తా పడిందని…ఎల్లోమీడియా పత్రికలు, ఛానళ్లు నానా హంగామా చేస్తున్నాయి.
తాజాగా 2 వేల కోట్ల స్కామ్‌పై టీడీపీ నేతలు, ఎల్లోమీడియా చేస్తున్న ఓవరాక్షన్‌పై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు. పచ్చమీడియా రోజురోజుకు దిగజారిపోతుందని ఫైర్ అయ్యారు. రెండు వేల కోట్లు అక్రమ లావాదేవీలు జరిగాయని సీబీడీటీ అధికారులు స్పష్టంగా ప్రెస్ నోట్‌లో చెప్పారని ఆర్కే తెలిపారు. శ్రీనివాస్ ఇంటిపై జరిగిన ఐటీ దాడుల్లో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ అడ్డంగా దొరికిపోయారని అన్నారు. సీబీడీటీ ప్రాథమిక విచారణ లోనే రెండు వేల కోట్ల అక్రమ వ్యవహారం జరిగితే ఇక పూర్తిస్థాయిలో విచారణ జరిగితే చంద్రబాబుకు సంబంధించిన వేల కోట్ల అక్రమ సంపాదన బయట పడుతుందని ఆర్కే ఆరోపించారు.
తన మాజీ పీఎస్ ఇంటిపై ఐటీ దాడులు జరిగితే చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు… తన బినామీ రాకేష్ కంపెనీలపై ఐటీ దాడులు జరిగితే లోకేష్ ఎందుకు నోరు మెదపడం లేదు…తన కొడుకు కంపెనీలపై ఐటీ దాడులు జరిగితే మాజీ మంత్రి పుల్లారావు ఎందుకు నోరు విప్పడం లేదని ఆర్కే ప్రశ్నించారు. ఐటీ దాడుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే పవన్‌కల్యాణ్ రాజధానిలో పర్యటించారని విమర్శించారు. చంద్రబాబు ఆదేశాలమేరకు అమరావతిపై రచ్చరచ్చ చేస్తున్న పవన్‌కల్యాణ్, సీపీఐ రామకృష్ణ, నారాయణలు ఇప్పుడు ఈ 2 వేలకోట్ల స్కామ్‌పై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ఐటీదాడులపై చంద్రబాబు, లోకేష్‌లు తేలుకుట్టిన దొంగల్లా కామ్‌గా ఊరుకుంటే… పచ్చమీడియా మాత్రం 2 వేల కోట్ల స్కామ్‌ను పక్కదారి పట్టించేందుకే గొంతులు చించుకుంటుందని ఆర్కే ఓ రేంజ్‌లో ఉతికారేసారు. మొత్తంగా ఐటీ దాడులపై బాబు, లోకేష్, పవన్, సీపీఐ రామకృష్ణ, నారాయణ, ఎల్లో మీడియా తీరును వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే తీవ్రంగా ఎండగట్టారు.