చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌తోపాటు తన కుమారుడు లోకేష్ బినామీ కిలారు రాజేష్, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్, వైఎస్సార్ కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కంపెనీలపై దాడులు చేసినట్లు ఐటీ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఐటీ దాడుల్లో తనకు సంబంధించిన రూ.2వేల కోట్ల లావాదేవీల విషయం వెలుగుచూసినా చంద్రబాబు మాత్రం నోరు విప్పడంలేదు. ఐటీ శాఖ ప్రకటన విడుదల చేసిన తర్వాత టీడీపీ నేతలు కొందరు ఆ దాడులతో తమకు సంబంధంలేదని బుకాయించేందుకు ప్రయత్నించినా ప్రజల్లో మాత్రం అవి చంద్రబాబు డబ్బులేననే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ చంద్రబాబు వాటి గురించి వివరణ ఇవ్వకపోగా ఎవరికీ అందుబాటులో లేకుండా హైదరాబాద్ వెళ్లిపోయారు.
అయితే తాజాగా 2 వేల కోట్ల స్కామ్‌లో చంద్రబాబు పాత్రపై సంచలన నిజాలు బయటపడుతున్నాయి. ఈ 2 వేల కోట్లరూపాయల బ్లాక్ మనీని చంద్రబాబు ముందుగా హవాలా ద్వారా విదేశాలకు తరలించి…అక్కడ నుంచి విదేశీపెట్టుబడుల రూపంలో తన బినామీ కాంట్రాక్ట్ సంస్థలకు మళ్లించి, తెలివిగా తన ఖాతాలోవేసుకున్న సంగతి ఐటీ దాడుల్లో బయటపడింది. వివరాల్లోకి వెళితే నవ్యాంధ్రప్రదేశ్‌లో 2014 నుంచి 2019 మధ్య తాను అధికారంలో ఉన్నప్పుడు పనులు కట్టబెట్టిన కాంట్రాక్టు సంస్థల నుంచి కమీషన్లు వసూలు చేసుకోవడానికి చంద్రబాబు బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థలను ఏర్పాటు చేయించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్రాలుగా పనిచేసే మూడు ప్రధాన కాంట్రాక్టు సంస్థలపై ఫిబ్రవరి 6 నుంచి 10 వరకూ నిర్వహించిన దాడుల్లో రూ.రెండు వేల కోట్లకు పైగా నల్లధనం రాకెట్ బయటపడిందని ఐటీ శాఖ ప్రకటించింది.
అయితే ఈ 2 వేల కోట్ల నల్లధనాన్ని హవాలా వ్యాపారి హసన్ అలీ ద్వారా సింగపూర్‌కు తరలించి.. అక్కడి నుంచి తన సన్నిహితుడుకి చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్సులోకి విదేశీ పెట్టుబడుల రూపంలో చంద్రబాబు రప్పించారు. ఆ తర్వాత ఆర్వీఆర్ ప్రాజెక్ట్సు నుంచి బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థలకు మళ్లించి.. ఆ ధనాన్ని తన ఖజానాలో వేసుకున్న సంగతి బయటపడింది. ఒక్క చంద్రబాబు పీఎస్‌పై జరిగిన ఐటీ దాడుల్లోనే 2 వేల కోట్ల రూపాయల బాగోతం బయటపెడితే..గత ఐదేళ్లలో చంద్రబాబు అవినీతి అక్రమాలపై విచారణ జరిపితే లక్షల కోట్ల దోపిడీ బాగోతం బయటపడే అవకాశం ఉంది. 2 వేల కోట్లను చంద్రబాబు తెలివిగా…హవాలా ద్వారా విదేశాలకు తరలించి..విదేశీపెట్టుబడుల రూపంలో తిరిగి తన బోగస్ కంపెనీల్లోకి మళ్లించి..వాటిని మళ్లీ తన ఖాతాలో వేసుకున్న వైనం చూసి ఐటీ అధికారులే నివ్వెరపోతున్నారు..ఘరానా ఆర్థిక నేరగాళ్లు కూడా చంద్రబాబు ముందు పనికిరారని ఐటీ శాఖలో చర్చ జరుగుతోంది. ఈ హవాలా బాగోతంపై ఐటీ శాఖ అధికారులు లోతుగా దర్యాప్తు చేసేందుకు సిద్ధమవుతున్నారు.దీంతో చంద్రబాబు హవాలా, మనీలాండరింగ్ కేసుల్లో నిండా కూరుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా 2 వేల కోట్ల స్కామ్‌లో చంద్రబాబు ఆధారాలతో సహా దొరికిపోవడంతో టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.