ఇప్పటికే అనేక విభాగాల్లో జాతీయస్థాయి గుర్తింపును పొందడంతోపాటు అవార్డులు అందుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు తాజాగా మరో ఐదు అవార్డులు వచ్చాయి. ఓ ప్రైవేటు సంస్థ ఒడిశాలోని భువనేశ్వర్‌లో శుక్ర, శనివారాల్లో నిర్వహించిన జాతీయ సెమినార్ సందర్భంగా ‘టెక్నాలజీ సభ అవార్డ్స్–2020’ను ప్రదానం చేశారు. ఇందులో ఏపీ పోలీసులకు ఐదు జాతీయ అవార్డులు లభించాయి.
సాంకేతికపరంగా వివిధ అంశాల్లో చూపిన ప్రతిభకుగాను ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు ఈ అవార్డులు దక్కాయి. రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తున్న పోలీసు వీక్లీ ఆఫ్ విధానానికి తొలి అవార్డు లభించింది. అలాగే దర్యాప్తులో భాగంగా అమలు పరుస్తున్న ‘ఇన్వెస్టిగేషన్ ట్రాకర్’, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్పందన కార్యక్రమం, ఎన్నికల్లో పోలీసు విధులు(బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీస్), ఎస్సీ, ఎస్టీ యాక్ట్ మానిటరింగ్ డ్యాష్ బోర్డు విధానానికి కూడా అవార్డులు లభించాయి. ఒడిశా ఐటీ శాఖ మంత్రి చేతుల మీదుగా ఏపీ పోలీసు ప్రతినిధులు ఈ అవార్డులను అందుకున్నారు.
డీజీపీ అభినందనలు..
ఏపీ పోలీసులు వరుసగా జాతీయ అవార్డులు అందుకోవడం పట్ల రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ శనివారం ఒక ప్రకటనలో వారికి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో అత్యుత్తమ పోలీసింగ్ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేక చర్యలు చేపట్టారని, ఆయన ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్న పోలీసు శాఖ ఇటీవలి కాలంలో ఎన్నో జాతీయ అవార్డులను అందుకుందని డీజీపీ గుర్తుచేశారు. కేంద్ర హోంశాఖతోపాటు జాతీయస్థాయి ప్రైవేటు సంస్థల నుంచి కూడా ఏపీ పోలీసులు సాంకేతిక, దర్యాప్తు తదితర అంశాల్లో అవార్డులు అందుకున్నారన్నారు. ఏపీ పోలీసులు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, జాతీయ స్థాయిలో రాష్ట్రానికి మంచిపేరు తేవాలని ఆయన కోరారు.