కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం మైసూరు నుంచి మంగళూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ టూరిస్ట్ బస్సు.. ఉడుపి సమీపంలోని చిక్కమగళూరు ఘాట్ రోడ్డు కార్క తాలూకా మాళె సమీపంలోని లోయలో అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు రెస్క్యూ టీం సహాయంతో.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు అతివేగంగా వెళ్తూ.. బండరాళ్లను ఢీ కొనడంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది టూరిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా మైసూర్‌కు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులుగా గుర్తించారు. విహారయాత్ర కోసమని వీరు మైసూర్ నుంచి బయలుదేరగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
