పెళ్లి కాలేదని నమ్మించి తోటి టీచరమ్మను ప్రేమ పేరుతో మోసం చేయడంతో ఆవేదనకు లోనైన ఆమె విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లా బేలూరులో శుక్రవారం జరిగింది. వివరాలు… రాణి, ధనంజయ్‌లో చిక్కమగళూరు జిల్లా యల్లందూరు ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అప్పటికే వివాహం అయిన ధనుంజయ్ తనకు వివాహం కాలేదని రాణిని నమ్మించాడు. ప్రేమలోకి దింపాడు.
పెళ్లి చేసుకుంటానని ఆమె నుంచి రూ. లక్షల నగదు తీసుకున్నాడు. ఇటీవల రాణికి హాసన్ జిల్లాకు బదిలీ అయ్యింది. దీంతో పెళ్లి చేసుకుందామని పలుమార్లు ధనుంజయ్‌ను కోరింది. అయితే అతని నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో అనుమానించిన రాణి తన సోదరుడు రాకేశ్‌కు విషయం చెప్పడంతో అతను ధనుంజయ్ గురించి ఆరా తీయడంతో అతనికి అప్పటికే పెళ్లి జరిగినట్లు తేలింది. దీంతో రాణి రెండు రోజుల క్రితం ధనుంజయ్‌తో గొడవపడింది. నన్ను మోసం చేశావని నిలదీసింది. ఊరికే వదలనని హెచ్చరించి హాసన్‌కు వచ్చేసింది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపం చెంది విషం తాగింది. దీంతో కుటుంబ సభ్యులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించింది. దీంతో రాణి సోదరుడు రాకేశ్ ఈ ఘటనపై బేలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.