అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు పోలీసులను అడ్డం పెట్టుకుని, నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలను రాజకీయంగా వేధింపులకు గురి చేశారు. అయితే ఇప్పుడు అదే పోలీసులు తమకు చుక్కలు చూపిస్తుండడంతో జీర్ణించుకోలేక పదేపదే నోరుపారేసుకుంటున్నారు. ఇటీవల చంద్రబాబు సమక్షంలోనే మళ్లీ అధికారంలోకి రాగానే పోలీసులతో నా బూట్లు నాకిస్తా అంటూ అనంతపురం మాజీఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వివాదాస్పదవ్యాఖ్యలు చేశారు. జేసీ వ్యాఖ‌్యలకు మాజీ పోలీస్ అధికారి, హిందూపురం వైసీపీఎంపీ గోరంట్ల మాధవ్ బూట్లు నాకి మరీ పోలీసుల గొప్పతనాన్నిచాటారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీకి కౌంటర్ ఇచ్చారు. అలాగే టీడీపీ నేత వర్ల రామయ్య కూడా వైసీపీ తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నారు..మీ అందరి జాతకాలు నా దగ్గరున్నాయంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు.. దీంతో వర్ల రామయ్య నోరు అదుపులో పెట్టుకో అంటూ.. రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం హెచ్చరించింది.
తాజాగా మరో టీడీపీ నేత కేఈ ప్రభాకర్ కూడా పోలీసులపై రెచ్చిపోయారు. తాజాగా టీడీపీ కార్యకర్తల సమావేశంలో కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ..తమ పార్టీ అధికారంలోకి వస్తే పోలీసులకు తామంటే ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ఈ రోజు ఇంట్లోకి వచ్చిన పోలీసులను.. ఇంటి గేటు బయట నిలబెడతామని కామెంట్ చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు మరింతగా రెచ్చిపోయి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత ఐదేళ్ల టీడీపీ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని, పోలీసులను కూడా లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా అవినీతి, అక్రమాలకు పాల్పడిన టీడీపీ నేతలు..ఇప్పుడు తమ దోపిడీకి పోలీసులు ఎక్కడక్కడ చెక్ పెడుతుండడంతో తట్టుకోలేకపోతున్నారు. అందుకే టీడీపీ నేతలు వరుసగా పోలీసులను కించపర్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా టీడీపీ నేతల తీరుపై ఏపీ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులకు ఐదేళ్ల సర్వీస్ అని..కాని మేము 30 ఏళ్లు సర్వీస్‌లో ఉంటామని, కుటుంబాలను వదలి, 24 గంటలు ప్రజల కోసం పని చేసే మా పోలీసులపై అవాకులు చెవాకులు పేలితే ఊరుకునేది లేదని..టీడీపీ నేతలు కాస్త నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకుంటే మా తఢాఖా ఏంటో చూపిస్తామని పోలీసులు టీడీపీ నేతలకు వార్నింగ్‌లు ఇస్తున్నారు. మొత్తంగా పోలీసులపై కించపర్చేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు చూస్తే బాబు బ్యాచ్ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.