ఐటీ శాఖ దాడుల్లో బయటపడిన 2 వేల కోట్ల కుంభకోణంతో చంద్రబాబు అవినీతి బండారం బట్టబయలైందని గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే చంద్రబాబు అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని మద్దాలి డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు బయటకు వచ్చినవి చాలా తక్కువే … చంద్రబాబు ఖాతాలో ఇంకా పెద్ద కుంభకోణాలే ఉన్నాయని ఎమ్మెల్యే మద్దాలి గిరి ఆరోపించారు. త్వరలోనే అవన్నీ బయటకు వస్తాయన్నారు. ఐటీ అధికారులు నిర్వహించిన సోదాల్లో చంద్రబాబు, ఆయన సన్నిహితుల అవినీతి బండారం బట్టబయలైందన్నారు. ఎప్పుడూ నీతి, నిజాయితీకి మారు పేరు అంటూ చెప్పుకునే చంద్రబాబు నాయుడు.. ఇప్పుడేం సమాధానం చెబుతారని ఎమ్మెల్యే గిరిధర్ ప్రశ్నించారు. ఇంత జరిగినా చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. చంద్రబాబు, అతని సన్నిహితులపై నిష్పక్షపాతంగా విచారణ జరిపితే వాస్తవాలు బయపడతాయని ఎమ్మెల్యే గిరి వ్యాఖ్యానించారు. ఇక ఇంత జరుగుతున్నా ఎల్లో మీడియా కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబును మించిన ఘనుడు లేడని విమర్శించారు. ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు నాయుడు మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని మద్దాలి గిరి ఆరోపించారు. కాగా టీడీపీ ఎమ్మెల్యే అయిన మద్దాలిగిరి ఇటీవల చంద్రబాబు తీరును వ్యతిరేకిస్తూ..సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అయితే అసెంబ్లీ మాత్రం వంశీ తరహాలో స్వతంత్ర్య ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే సాంకేతికంగా మాత్రం ఇంకా టీడీపీ ఎమ్మెల్యేగానే ఉన్నారు. మొత్తంగా ఐటీ దాడుల నేపథ్యంలో చంద్రబాబు అవినీతిపై గుంటూరు ఎమ్మెల్యే మద్దాలి గిరి చేసిన వ్యాఖ‌్యలు సంచలనం రేపుతున్నాయి.
