టీడీపీ అధినేత చంద్రబాబు పీఎస్‌పై జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో బయటపడిన 2 వేల కోట్ల కుంభకోణం ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది. ఈ 2 వేల కోట్ల కుంభకోణంలో తక్షణమే చంద్రబాబు, లోకేష్‌ల పాత్రపై విచారణ జరిపి అరెస్ట్ చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే వైసీపీ నేతల విమర్శలపై నారాలోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 40 చోట్ల సోదాలు నిర్వహిస్తే 85 లక్షలు దొరికాయి అని ఐటీ శాఖ అంటుంటే చంద్రబాబు గారి మాజీ పీఎస్ ఇంట్లో 2 వేల కోట్లు దొరికాయి అని తప్పుడు ప్రచారం చేస్తూ వైకాపా నాయకులు శునకానందం పొందుతున్నారంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. కాగా నారా లోకేష్ చేసిన ట్వీట్‌పై వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు కౌంటర్ వేశారు. ఏమీ తవ్వ కుండానే ఎలుకలు దొరికాయని కరెక్టుగా తవ్వితే ఏనుగులు దొరుకుతాయని మంత్రి కన్నబాబు అన్నారు.
చంద్రబాబు అవినీతికి అంతూ పొంతూ లేదనడానికి తాజా ఐటీ దాడులే ఉదాహరణ. చంద్రబాబు మాజీ వ్యక్తిగత సహాయకుడి దగ్గర రూ.2 వేల కోట్లు ఉన్నట్లు కేంద్ర ఐటీ శాఖ నోట్ విడుదల చేసింది కాని తక్కువే పట్టుకున్నారు తమ దగ్గర చాలా ఉంది అన్న చందంగా లోకేష్ ట్వీట్ ఉంది…. కంగారు పడొద్దు… ఇల్లు అలకగానే పండగ కాదు… మొదలైంది ఇప్పుడే… మీ బాగోతాలు. మీ కథలన్నీ బయటకొస్తాయని కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రతి కుటుంబానికి మేలు జరగాలని మీకు అధికారం ఇస్తే గత ఐదేళ్లు రాష్ట్రాన్ని లూటీ చేశారని, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సొంత ప్రయోజనాల కోసమే పనిచేసారని కన్నబాబు దుయ్యబట్టారు. ఇవి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన సోదాలు కావు ఐటీ శాఖ చేసిన సోదాలు…అయినా కొన్ని సబ్ కాంట్రాక్టుల్లో అవినీతి జరిగిందని చెబితే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు అని కన్నబాబు లోకేష్, చంద్రబాబునుద్దేశించి ఎద్దేవా చేశారు. ఇక అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాల్లో సైతం స్వప్రయోజనాల కోసమే పనిచేశారని కన్నబాబు ఆరోపించారు.. అమరావతిలో జరిగిన ఇన్ సైడ్ ట్రెడింగ్‌ను మంత్రుల సబ్ కమిటీ బయట పెట్టిందని మంత్రి తెలిపారు. ప్రత్యేక హోదా తాకట్టు పెట్టి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మీ చేతుల్లోకి తెచ్చుకున్నారని చంద్రబాబు, లోకేష్‌లను ఉద్దేశించి ఆరోపించారు. ఈ 2 వేల కోట్ల కుంభకోణంపై లోతుగా దర్యాప్తు చేస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తాయని మంత్రి కన్నబాబు అన్నారు. మొత్తంగా నారాలోకేష్ ట్వీట్‌కు మంత్రి కన్నబాబు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.