రాష్ట్రం విడిపోయాక మొట్ట మొదటి సీఎంగా చెట్టు కింద పాలన చేశానని చెప్పుకునే చంద్రబాబు బండారం బట్టబయలైందని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. కష్టపడుతున్నానని చెప్పి తన పాలనలో రాష్ట్రాన్ని దోచేశారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సహాయకుడు దగ్గరే రూ.2 వేల కోట్లు దొరికితే బాబు, లోకేష్, వారి అనుచరులు, బినామీల దగ్గర ఎన్ని వేల కోట్లు దొరుకుతాయన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయన్నారు. షెల్ కంపెనీల పేరుతో బాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఇక బాబు జైల్లో ఉంటారనడానికి ఈ సంఘటనే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఆయన అవినీతిపై సీబీఐ, ఈడీలతో దర్యాప్తు చేయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ‘ఎన్నికలకు ముందు బాబు ఇబ్బడి ముబ్బడిగా కాంట్రాక్ట్‌లకు నిధులు విడుదల చేసి జేబులు నింపుకున్నారు. పోలవరం కాంట్రాక్ట్‌ల దగ్గర నుంచి బాబు ప్రవేశపెట్టిన పథకాలన్నిటిపైనా సీబీఐ విచారణ చేసి ప్రజాధనాన్ని కాపాడాలి. బాబు ముందు ఆలోచనలతోనే సీబీఐని ఏపీకి రాకుండా చేయాలని చూశారు. కానీ ఆయన పాపం పండింది. మళ్లీ చీకట్లో ఎవరి కాళ్లు పట్టుకున్నా శిక్ష పడటం ఖాయం. ఆయనపై విచారణ చేపడితే లక్షల కోట్ల అవినీతి సొమ్ము బయటపడుతుంది. బాబు పాలనలో సింగపూర్, దావోస్, అమెరికా పర్యటనలతో ఏపీకి పెట్టుబడులు వస్తాయని ఆశించాము. కానీ, ఆయన లావాదేవీలు సరిచేసుకోడానికి విదేశీ పర్యటనలు చేశారని తేలిపోయింద’ని అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు.
