మూసపద్దతిలో చేస్తున్న వ్యవసాయానికి స్వస్తి పలికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆరుగాలం కష్టపడి చేస్తున్న వరిపంటకు అంతిమంగా ఎకరాకు 15 వెలకంటే ఎక్కువగిట్టుబాటు కావడం లేదన్న అంశాన్ని రైతాంగం గుర్తించాలని ఆయన ఉపదేశించారు.అందుకు ప్రత్యామ్నాయంగా ఫామాయిల్, కూరగాయల వంటి పంటలపై దృష్టి సారిస్తే అధిక లాభాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. లాభసాటి పంటలపై రైతులకు అవగాహన కల్పించేందుకు గాను త్వరలో సదస్సులు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
గోదావరి జలాలు పారకం పై కాళేశ్వరం చివరి ఆయాకట్టుప్రాంతంలోనీ కాలువ లపై ఆయన గురువారం రాత్రి పొద్దుపోయేంత వరకు తిరిగి శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు విస్తృతంగా పర్యటించారు. పెన్ పహాడ్ మండలంలోని జల్మలకుంట తండా,చిన్నసీతారం,పెద్ద సీతారాం ,న్యూ బంజారాహిల్స్,వేల్పుల కుంటతండా లతో పాటు చెట్ల ముకుందాపురం తదితర గ్రామాల్లోని కాలువల మీద ఆయన ప్రయాణం కొనసాగింది. నీటిపారుదల అధికారులతో సహా పర్యటించిన ఆయన 350 కిలో మీటర్ల సుదూరం నుండి సూర్యపేట జిల్లా చివరి భాగం పెన్ పహాడ్ మండలం వరకు పరుగులు పెడుతున్న గోదావరి జలాలకు ఎక్కడ కూడా బ్రేక్ పడకుండా చూడాలని ఆదేశించారు.వచ్చే ఖరీఫ్ నుండి గోదావరి జలాలు పుష్కలంగా పారిస్తామని ఆయన ప్రకటించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మీదటనే.బీళ్లు గా ఉన్న భూములు సస్యశ్యామలం గా మారాయని మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు.ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథుడు అని ఆయన చలువ తోటే సూర్యపేట కు గోదావరి జలాలు పరుగులు పెడుతున్నాయన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కాక పోయినా టి ఆర్ యస్ పార్టీ అధికారంలోకి రాకపోయినా సూర్యపేట కు గోదావరి జలాలు చేరేవా అంటూ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.