అమరావతి పేరుతో రెండు నెలలుగా వరస డ్రామాలతో రాజధాని రాజకీయాన్ని రక్తికట్టించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు మరో డ్రామాకు తెరతీశారు. ఫిబ్రవరి 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జనచైతన్యయాత్రలు నిర్వహించేందుకు చంద్రబాబు రెడీ అయ్యాడు. బాబు నయా రాజకీయంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా వైసీపీ అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అధికారం పోయినదగ్గర నుంచి పిచ్చెక్కినవాడిలా ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు చైతన్య యాత్రల పేరుతో మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించడం విడ్డూరంగా ఉందని రామచంద్రయ్య విరుచుకుపడ్డారు. నిజాయితీగా లేని కారణంగానే గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారన్న వాస్తవాన్ని చంద్రబాబు గుర్తించడం లేదని విమర్శించారు.
గత ఐదేళ్ల కాలంలో చంద్రబాబు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, తన అవినీతి సొమ్మంతా గడిచిన ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాలకు బదలాయించారని రామచంద్రయ్య ఆరోపించారు. ఇటీవల టీడీపీ నేతలపై జరుగుతున్న ఐటీ దాడులపై కూడా రామచంద్రయ్య స్పందించారు. ఐటీ దాడుల్లో ఆధారాలతో సహా దొరికిపోవడం వల్లే చంద్రబాబు వాటిపై మాట్లాడలేకపోతున్నారని ధ్వజమెత్తారు. గతంలో నువ్వు మళ్లీ ప్రధాని అవుతావో చూస్తా అంటూ తొడకొట్టిన చంద్రబాబు..ఇప్పుడు అదే మోదీ పంచన చేరేందుకు తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు. దేశ ఆర్థిక రంగం కుదేలైనా, ఎన్నో సమస్యలు వచ్చినా, ఆఖరకు ఏపీకి నిధుల కేటాయింపులో అన్యాయం జరిగినా.. బీజేపీపై విమర్శలు చేయకుండా మౌనంగా ఉంటున్నారని చంద్రబాబు తీరును ఎండగట్టారు. గత ఐదేళ్లలో చేసిన ప్రజా విద్రోహ కార్యక్రమాలు బట్టబయలై చంద్రబాబు జైలుకు వెళ్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని రామచంద్రయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాబు అవినీతి ఆరోపణలపై కేంద్ర సంస్థలు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
ఇక సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గంటన్నరపాటు రాష్ట్ర సమస్యలపై సీఎం జగన్‌తో మోదీ చర్చిస్తే… ఎల్లో మీడియా మాత్రం వేరే విధంగా వార్తలు రాసిందని మండిపడ్డారు. కియాపై ప్రధాని మందలించాడని చెప్పడం దారుణమన్నారు. అసలు ప్రధాని మోదీ, జగన్‌తో ఏం మాట్లాడారో ఎల్లోమీడియాకు ఎలా తెలుస్తాయని..ప్రశ్నించారు…మీరేమైనా మోదీ పక్కన కూర్చుని చూసినట్లు అడ్డగోలుగా కథనాలు రాస్తారేంటీ అంటూ…రామచంద్రయ్య నిలదీశారు..ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ఎల్లో మీడియా, చంద్రబాబు కుట్ర పన్నారని మండిపడ్డారు. మొత్తంగా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబు, ఎల్లోమీడియాను వైసీపీ సీనియర్ నేత సి. రామచంద్రయ్య దుమ్ముదులిపేశారు.