గత కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు దేశాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని, ఇప్పుడు దేశంలో ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఢిల్లీలో నిర్వహించిన టైమ్స్ నౌ సమ్మిట్‌లో భాగంగా భారతదేశ నిర్మాణంలో రాష్ర్టాల పాత్ర అనే అంశంపై కేటీఆర్ మాట్లాడారు.
ప్రపంచమంతా తెలంగాణ వైపు చూస్తోంది అని కేటీఆర్ తెలిపారు. దేశాభివృద్ధిలో రాష్ర్టాల భాగస్వామ్యం కీలకమన్నారు. బలమైన రాష్ర్టాలతోనే బలమైన దేశం నిర్మాణం అవుతోంది అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో రాహుల్‌ను, మోదీని ప్రజలు తిరస్కరించారు. జాతీయ పార్టీలకు ప్రజల్లో ఆదరణ తగ్గిపోయింది.
కాంగ్రెస్, బీజేపీ దేశానికి చేసిందేమీ లేదన్నారు కేటీఆర్. టీఆర్ఎస్ పార్టీ ఏ జాతీయ పార్టీకి బీ టీం కాదు. తాము తెలంగాణకు ఏ టీం అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజా తీర్పును స్వీకరిస్తామని ఐటీ మంత్రి చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులు తమ శత్రువులు కాదని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు. ప్రస్తుత రాజధాని నగరమైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఒప్పుకోరని ఆయన స్పష్టం చేశారు.ఢిల్లీ కూడా హైదరాబాద్ నగరం వైపు చూడటం చాలా గర్వంగా ఉంది అని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.