ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపధ్యంలో కేంద్ర క్యాబినెట్ విస్తరణలో ఇద్దరు వైఎస్ఆర్సీపీ ఎంపీలకు చోటు దక్కబోతున్నట్టుగా పలు వార్తలు వస్తున్నాయి. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి దీనికి చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి – ప్రధానమంత్రిల మధ్య బుధవారం జరగబోతున్న రెండుగంటలపాటు జరిగే కీలక సమావేశంలో కేంద్ర క్యాబినెట్ లోకి వైసిపీ చేరటానికి జగన్మోహన్రెడ్డి ప్రధాని చర్చించనున్నారట. అలాగే విజయసాయి రెడ్డి సహాయ మంత్రిగా స్వతంత్ర హోదాలో, బాపట్ల నుంచి గెలిచిన సామాన్యుడు నందిగం సురేష్ మరొక సహాయమంత్రిగానూ కేంద్ర క్యాబినెట్ లో చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయతే వైసీపికీ, బీజెపికి మధ్య సయోధ్య కుదరకపోయే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.
ఇటీవల బీజెపీతో జట్టుకట్టిన జనసేనను అడ్డంపెట్టుకుని రాష్ట్రంలో మరోసారి వ్యూహాత్మక రాజకీయం నడపవచ్చని భావించిన టీడీపీకి ఈ పరిణామం మింగుడు పడడం లేదు. కీలక బిల్లులను రాజ్యసభలో పాస్ చేయించుకోవాలంటే, బీజెపీకి కచ్చితంగా ప్రాంతీయ పార్టీల సహకారం అవసరం. అలాగే మార్చ్ లో ఏపీ నుంచి ఖాళీకానున్న నాలుగు స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికవుతారు కాబట్టి, అది రాజ్యసభలో అవసరం దృష్ట్యా వైసీపీకి పదవులిచ్చే అవకాశముంది. అయితే కేంద్రం సహకారంకోసం తనకు తానుగా తగ్గి మాట్లాడిన జగన్ ముఖ్యమంత్రిగా తన ప్రాధాన్యాలేమిటో చెప్పారు.. కేంద్రానికి కూడా తమతో అవసరాలుంటాయనీ, ఆ సందర్భంలో హోదా అంశం మీద గట్టిగా అడుగుతామని కూడా చెప్పారు. అలాగే ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయం కాదన్నారు. అయితే పోలవరం నిధులు, రాష్ట్రానికి రావలసిన వాటాలు, మరిన్ని బకాయిలకోసం ప్రధానితో మాట్లాడేందుకు వెళ్లనున్న జగన్ ను కేంద్ర క్యాబినెట్ లో వైసిపీ ని భాగస్వామి కావాలని స్వయంగా నరేంద్ర మోడీ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ డిల్లీ సర్కిళ్లలో వినిపిస్తోంది.. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జగన్ కూడా దానికి అంగీకరిస్తారని అర్ధమవుతోంది.