తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీళ్లు అందించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం .ఈ ప్రాజెక్టు ఇటు తాగునీరు, అటు సాగునీటికి అవసరం ఉన్నప్పుడల్లా జలాలను అందిస్తూ జీవధారగా మారుతున్నది. రిజర్వాయర్లలో నిల్వలు తగ్గిన వెంటనే గోదావరి జలాలతో తిరిగి నింపేందుకు అద్భుతంగా ఉపయోగపడుతున్నది. నీటి ఏడాది చివరి దశకు చేరుకుంటున్న సమయంలోనూ ఎలాంటి ఢోకాలేకుండా జలధారలను అందిస్తున్నది. ఎస్సారెస్పీతో సంబంధం లేకుండా లోయర్‌మానేరు అవసరాలను ఎప్పటికప్పుడు తీరుస్తున్నది.
శ్రీరాంసాగర్ దిగువ ఆయకట్టుతోపాటు, పలు జిల్లాల్లో తాగునీటికి ఇబ్బందులు కలుగకుండా చేస్తున్నది. ప్రస్తుతం లోయర్‌మానేరులో నీటి నిల్వలు తగ్గినమేరకు జలాలను తరలించే ప్రక్రియ మొదలయింది. రెండ్రోజులుగా అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయం మీదుగా ఎల్‌ఎండీకి గోదావరిజలాలను తరలిస్తున్నారు. ముఖ్యంగా కరంటు వినియోగం తక్కువగా ఉండే సమయంలోనే ఈ ఎత్తిపోతలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఐదు టీఎంసీల జలాల తరలింపు లక్ష్యంగా ఆరునుంచి ఏడురోజులపాటు కాళేశ్వరం మోటర్లను నడుపనున్నట్టు వారు పేర్కొంటున్నారు.
నీటి సంవత్సరం ముగియడానికి నాలుగు నెలలు మాత్రమే ఉన్నప్పటికీ ఎస్సారెస్పీలో ఇంకా 63.19 టీఎంసీల నీటినిల్వలు ఉన్నాయి. దిగువనఉన్న లోయర్‌మానేరు తాగు, సాగునీటి అవసరాలను కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తిగా తీరుస్తుండటంతో ఎస్సారెస్పీపై పెనుభారం తగ్గిపోయింది. గతంలోనే లక్ష్మీ (మేడిగడ్డ) బరాజ్ నుంచి గోదావరి జలాలను ఎల్లంపల్లి, ఆపై శ్రీరాజరాజేశ్వర (మిడ్‌మానేరు)కు తరలించిన అధికారులు.. దిగువన ఉన్న ఎల్‌ఎండీని కూడా పూర్తిస్థాయిలో నింపారు. ఈ క్రమంలోనే ఎస్సారార్‌లో ముందుచూపుతో దాదాపు 25 టీఎంసీల నీటినిల్వలను కూడా సిద్ధంగా ఉంచారు.
గత అక్టోబర్ 13 నుంచి ఎల్‌ఎండీ ద్వారా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలోని ఆయకట్టుకు నీళ్లు అందిస్తున్నారు. కొన్నివేల చెరువులు, కుంటలను కూడా నింపారు. ఎస్సారెస్పీ స్టేజ్-1లో 5,05,720 ఎకరాలు, స్టేజ్-2 పరిధిలోని 3,97,000 ఎకరాలకు రికార్డుస్థాయిలో నీరందిస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు సుమారు 35 టీఎంసీల నీటిని ఆయాప్రాంతాలకు తరలించారు. దీంతో 24.034 టీఎంసీల సామర్థ్యంగల ఎల్‌ఎండీలో ప్రస్తుతం నీటినిల్వ 8.348 టీఎంసీలకు తగ్గిపోయింది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రాజెక్టులో మళ్లీ పూర్తి నిల్వలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కాళేశ్వరం మోటర్లు సిద్ధమయ్యాయి.