పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన నిధులను కేంద్రం విడుదల చేయడం, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర ప్రాజెక్టులకోసం ప్రతిపాదించిన కేటాయింపులను పెంచడం, ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీల సాధన దిశగా ప్రక్రియను వేగవంతం చేయడం.. లక్ష్యాలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రధానితో సీఎం కూలంకుషంగా చర్చించనున్నారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్ల సాధనకోసం సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోదీకి ఇటీవల లేఖ రాయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా తాను లేఖలో పేర్కొన్న అంశాలను ప్రస్తావించనున్నారు. బుధవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానంతరం సీఎం వైఎస్ జగన్ సచివాలయం నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి అక్కడినుంచి ఢిల్లీకి బయల్దేరి వెళతారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. సాయంత్రం 4.10 గంటల నుంచి 6 గంటల మధ్యలో ప్రధానితో సమావేశమవుతారు
