ఏపీ నుంచి కియా మోటార్స్ తమిళనాడుకు తరలిపోతుందంటూ ప్రముఖ ఆంగ్ల న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ రాసిన అసత్యకథనంపై రాజకీయంగా పెనుదుమారమే చెలరేగింది. రాయిటర్స్ రాసిన కథనాన్ని అడ్డంపెట్టుకుని టీడీపీ అధినేత చంద్రబాబు చెలరేగిపోయాడు. జగన్ ప్రభుత్వ తీరువల్లే నేను కష్టపడిన తెచ్చిన పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ గగ్గోలుపెట్టాడు. ఇక ఎల్లోమీడియా ఛానళ్లు అయితే వైసీపీ నేతల బెదిరింపువల్లే …కియా తమిళనాడుకు తరలిపోతుందంటూ పచ్చ కథనాలు వండి వార్చాయి. అయితే రాయిటర్స్ కథనాన్ని ఇటు ఏపీ ప్రభుత్వం, కియా ప్రతినిధులతో పాటు, అటు తమిళనాడు ప్రభుత్వం కూడా ఖండించాయి. తమిళనాడుకు ప్రభుత్వానికి చెందిన ఓ అధికారితో కియా సంస్థ చర్చలు జరిపారంటూ రాయిటర్స్ రాసిన కథనం అసత్యమని ఆ రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీంతో రెండు రోజుల పాటు కియా తరలింపుపై రచ్చ చేసిన చంద్రబాబు రాయిటర్స్‌ను పక్కనపెట్టి…ఎకనమిక్ టైమ్స్ కథనంపై ప్రభుత్వంపై బురదజల్లడం మొదలెట్టాడు. అయితే రాయిటర్స్ కథనం వెనుక చంద్రబాబుకు కుట్ర ఉందని వైసీపీ నేతలు ఆరోపించారు.. ఈ ఆరోపణలకు బలం చేకూరేలా ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్ తాజాగా రాసిన సంపాదకీయంలో రాయిటర్స్‌కు, టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్య గల చీకటి బంధాన్ని బయటపెట్టారు.
అసలు రాయిటర్స్‌కు, చంద్రబాబుకు లంకె ఎలా కుదరిందో ఏబీకే విడమర్చి చెప్పారు. చంద్రబాబు పాలనలో విశాఖ, హైదరాబాద్‌లలో ‘డిజిటల్ డెవలప్‌మెంట్’ కార్యక్రమాల పథకాన్ని తలపెట్టి ఎన్నికలలో ప్రయోజనాలు పొందే టెక్నాలజీ మతలబుకు అంకురార్పణ జరిగిందని ఆయన పేర్కొన్నారు. 2018–2019 ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష వైసీపీని ఎన్నికలలో విజయం సాధించకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు బ్యాచ్ డిజిటల్ యంత్రాల్ని వినియోగించి దొరికిపోయిందని ఏబీకే ప్రసాద్ గుర్తు చేశారు. అలా డిజిటల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ఆధారంగా 2017లో రాయిటర్స్ సంస్థకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ గత టీడీపీ నాయకత్వం రెండు ఒప్పందాలు కుదుర్చుకుందని తెలిపారు. . డిజిటల్ కంటెంట్స్ మార్పిడి పేరిట, టెండర్లు పిలవకుండానే చంద్రబాబు హయాంలో ఒక్క రాయిటర్స్‌కే ప్రయోజనం కల్పిస్తూ ఒప్పందం చేసుకుందని ఏబీకే చెప్పారు.
అందుకే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం తలపెట్టిన రాజధాని వికేంద్రీకరణతో సహా, అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసే దిశగా చంద్రబాబు పన్నిన కుట్రలో రాయిటర్స్ ఇరుక్కుంది. అయితే తమిళనాడు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంతో రాయిటర్స్ సంస్థ ద్వారా కియా సంస్థ మేనేజ్‌మెంట్‌పైన, జగన్ ప్రభుత్వంపైన తప్పుడు ప్రచారం చేయించిన చంద్రబాబు కుట్ర బయటపడింది. మొత్తంగా 2017లో చంద్రబాబు ద్వారా ప్రయోజనం పొందిన రాయిటర్స్ జర్నలిజం విలువలను తుంగలో తొక్కి మరీ..చంద్రబాబు కోసం కుట్రపూరితంగా తప్పుడు కథనాలు ప్రచురించి వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూసింది. తన కులమీడియా రాస్తున్న అసత్యకథనాలను ప్రజలు నమ్మకపోవడంతో ఇలా రాయిటర్స్‌లాంటి ఆంగ్ల న్యూస్ ఏజెన్సీతో వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రకు తెగబడ్డాడు చంద్రబాబు. మొత్తంగా కియా తరలింపు కథనం ద్వారా చంద్రబాబుకు, రాయిటర్స్‌కు గల చీకటిబంధం బయటపడింది.