సుడా సుందరీకరణ వేగంగా జరగాలి. ఆదాయ మార్గాలు అన్వేషించాలి. అన్నీ విధాలుగా అభివృద్ధితో పాటు ఆదాయం పెరగాలి. జంక్షన్ల సుందరీకరణ అద్భుతమైన రీతిలో ఉండాలి. సిద్ధిపేటలో పెళ్లి జరిగితే.. మొక్కలు ఇచ్చే పధ్ధతి తేవాలని సుడా డైరెక్టర్లు, వైస్ చైర్మన్ రమణాచారికి దిశా నిర్దేశం చేశారు. సిద్ధిపేట సుడా కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్ లో ఆదివారం సాయంత్రం సుడా వర్టికల్ గార్డెన్ ను మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించి అనంతరం సుడా అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో భాగంగా 10కిలో మీటర్ల వరకు అటవీ సంపద పెంపొందించాలని మంత్రి సమక్షంలో చర్చించి నిర్ణయించారు. సుడా పరిధిలో గల 10 కిలో మీటర్ల మేర సెంట్రల్ మీడియంగా రెండు వైపులా కాగితపు చెట్లు బాగుంటుందని మంత్రి గారు సూచించారు. ప్రతి కిలో మీటరుకు ఒక మోడల్ చెట్టు పెంచాలని, సుడా పరిధిలో నర్సరీల పెంపకం పై చర్చించారు. పెట్రోల్ బంకుల వద్ద పచ్చ దనం ఉండాలని, భవనాల నిర్మాణం చేస్తూ చెట్లను తొలగిస్తున్నారని, మళ్లీ అక్కడ చెట్లు నాటేలా చర్యలు తీసుకోవాలని సుడా అధికారిక యంత్రాంగాన్ని ఆదేశించారు. హైదారాబాద్ లోని హెచ్ ఏండీఏ, అహ్మాదాబాద్ లో నర్సరీలు చూసి, వాటి నిర్వహణ తీరు ఏలా ఉందో తెలుసుకుని సుడా పరిధిలో కూడా అదే విధానాన్ని చేపట్టాలని అధికారిక యంత్రాంగానికి మంత్రి గారు దిశా నిర్దేశం చేశారు. ఔషధ మొక్కలు, వాటి గుణాలు ఏ రోగాన్ని నయం చేస్తుందో తెలుసుకుని వాటి పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ నర్సరీల నుంచే ప్రజలు నేరుగా తీసుకెళ్లే విధంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా అలాగే సుడాకు ఆదాయం వచ్చేలా ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని సూచించారు. దోమలు రానటువంటి మొక్కలు నర్సరీలో పెంచి వాటిని ప్రజలకు ఇవ్వాలని కోరారు. సిద్ధిపేటలో పెళ్లి జరిగితే.. మొక్కలు ఇచ్చే పధ్ధతి తేవాలని ఆ దిశగా సుడా అధికారిక యంత్రాంగం, పాలక వర్గం కృషి చేయాలని సూచించారు.
– సిద్ధిపేట జంక్షన్ల అభివృద్ధి పై మంత్రి గారిప్రత్యేక దృష్టి
సిద్ధిపేట పట్టణ చుట్టు పక్కల ప్రాంతాల జంక్షన్ల అభివృద్ధి పై మంత్రి హరీశ్ రావు గారు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు సిద్ధిపేటకు వచ్చే పొన్నాల దాబాల వద్ద రాజీవ్ రహదారి పై సుందరీకరణ చేస్తూ ఓ జంక్షన్ నిర్మాణం చేపట్టాలని, అందుకు అవసరమైన ఆర్కిటెక్ట్ గీసిన నమూనాల చిత్రాలను తిలకించి తుది మెరుగులు దిద్ది తొందరగా అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. పొన్నాల జంక్షన్ తో పాటు ఎన్సాన్ పల్లి సర్కిల్, రూరల్ పోలీసు స్టేషన్ సర్కిల్, బాబు జగ్జీవన్ రామ్ సర్కిల్- పునరుద్ధరణ, ముస్తాబాద్- డిగ్రీ కళాశాల సర్కిల్ , నాగదేవత ఆలయ సర్కిల్, సిరిసిల్లా బైపాస్ రోడ్డు సర్కిల్, కరీంనగర్- రంగీలా డాబా సర్కిల్ ప్రాంతాల జంక్షన్ల అభివృద్ధి సుందరీకరణ పై సుదీర్ఘంగా చర్చించారు.
– సుడాకు శాశ్వత ఆదాయం వచ్చేలా దృష్టి పెట్టండి
సుడా అభివృద్ధి కోసం శాశ్వాత ఆదాయం వచ్చేలా అన్వేషణ చేయాలని సుడా అధికారిక యంత్రాంగం, పాలక వర్గాన్ని మంత్రి హరీశ్ రావు గారు ఆదేశించారు. ప్రధానంగా విద్యుత్ ఆదా చేస్తూనే ఆదాయ మార్గాలు అన్వేషించి అన్నీ విధాలుగా అభివృద్ధి జరపాలని సూచించారు. సీసీ కెమెరాలు, ఫుట్ పాత్ ఏర్పాట్లు చేయాలి. కమర్షియల్ కాంప్లెక్సు నిర్మాణాలు చేపట్టాలని, ఇతరత్రా ఆదాయ వనరుల అంశాలపై దృష్టి సారించాలని అధికారిక యంత్రాంగం, పాలక వర్గానికి సూచించారు. అనంతరం నియోజక వర్గ పరిధిలోని మండలాలు, గ్రామాల వారీగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు, పురోగతి పై సమీక్షించారు. ఈ సమీక్షలో సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ రమణాచారి, సుడా డైరెక్టర్లు మచ్చవేణు, చంద్రశేఖర్, బర్ల మల్లిఖార్జున్, ఇతర డైరెక్టర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.