భద్రతా పరికరాల కొనుగోలులో పలు అవకతకలకు పాల్పడిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావును ఆల్‌ఇండియా సర్వీసెస్ నియమనిబంధనల నియమం (3) కింద ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దేశభద్రతకు సంబంధించిన పలు కీలక విషయాలను ఏబీ వెంకటేశ్వరావు బహిర్గతం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మామూలుగా అధికారులపై ఆరోపణలపై సస్పెండ్ చేయడం కామన్…అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం తనకు అత్యంత సన్నిహితుడైన ఏబీ వెంకటేశ్వరావును సస్పెండ్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. వైసీపీ ప్రభుత్వం ఫాక్షనిస్ట్ ధోరణి రానురానూ పరాకాష్టకు చేరుతోంది. ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపుతో వారి ఉన్మాదం చల్లారలేదు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులపై ఫాక్షనిస్ట్ పంజా విసిరింది అంటూ ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
అయితే చంద్రబాబుకు సొంత పార్టీ ఎంపీ కేశినేని షాక్ ఇచ్చాడు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు అసలు రంగును నాని బయటపెట్టారు. టీడీపీ హయాంలో ఆయన చేసిన అక్రమాలు నిజమేనని పరోక్షంగా అంగీకరించారు.. ఏబీవీ సస్పెన్షన్‌పై కేశినేని నాని ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… మీరు ముఖ్యమంత్రి అవడానికి, మీ పార్టీ అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని సన్మానిస్తారనుకుంటే సస్పెండ్ చేశారేంటి జగన్‌మోహన్‌రెడ్డి గారూ’ అని ట్వీట్ చేశారు. అయితే నాని ట్వీట్‌కు స్వయంగా సస్పెండ్ అయిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వేంకటేశ్వరావు వెంటనే స్పందించారు. ‘మీరూ, మీరూ పార్లమెంట్‌లో కలిసి మెలిసే ఉంటారుగా.. అందరూ కలిసి ఒక అభిప్రాయానికి రండి. నేను వృత్తి ధర్మం నిర్వర్తించానో లేక ఇంకేమైనా చేశానో.. నాక్కూడా ఒక క్లారిటీ వస్తుంది’ అని ట్వీట్ చేశారు.. అలాగే ‘ఏమిటోనండీ ఎంపీ గారూ.. మీరేమో ఇలా అంటారు.. మరి నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవడానికి నేనే కారణమని అంబటి రాంబాబు గారు అప్పట్లో కడుపుబ్బా నవ్వించారు’ అంటూ ఏబీవీ మరోట్వీట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య ట్వీట్ల వార్ టీడీపీలో కలకలం రేపుతోంది.
కాగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏబీవీ చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరించాడని…23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను బెదిరించి, ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చడంలో ఏబీవీ కీలక పాత్ర పోషించారని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. అంతే కాదు చంద్రబాబును ధిక్కరించిన టీడీపీ కీలక నేతలపై కూడా ఏబీవీ నిఘా పెట్టించాడని..వారిని వేధింపులకు గురి చేశాడని పార్టీలో చర్చ జరుగుతోంది. అందుకే ఏబీవీ సస్సెన్షన్‌పై చంద్రబాబు ఆక్రోశం వెళ్లగక్కుతుంటే..కొందరు టీడీపీ నేతలు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇలా ట్విట్టర్ వేదికగా కేశినేని నాని, ఏబీవీలు ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకోవడం చూస్తుంటే చంద్రబాబు ఆయనతో ఎన్ని అక్రమాలు చేయించాడో అర్థమవుతోంది. ఇప్పటికే చంద్రబాబు, లోకేష్‌ల తీరుపై పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన కేశినేని నాని ఇప్పుడు ఏబీవీ సస్సెన్షన్ వ్యవహారంలో చేసిన ట్వీట్లు రాజకీయంగా సంచలనంగా మారాయి. మొత్తంగా అధికారంలో ఉన్నప్పుడు ఏబీవీతో ఎన్నో అక్రమాలు చేయించిన చంద్రబాబు అసలు రంగును కేశినేని నాని తన ట్వీట్ ద్వారా బయటపెట్టాడని టీడీపీలో చర్చ జరుగుతోంది.