ఓవైపు మానవ సంబంధాలు మటు మాయమైపోతున్న రోజుల్లోనూ ఓ కుటుంబంలో జరిగిన సంఘటన అందరినీ నిర్ఘాంత పోయేలా చేస్తోంది. ఒకరికొకరు లేకుండా బ్రతకలేక కుటుంబంలో వారు పడిన భాద అంతా ఇంత కాదు. తాజాగా ఖమ్మం జిల్లా కొణిజర్లలో విషాదకరమైన ఘటన జరిగింది. కుమార్తె మరణాన్ని తట్టుకోలేని ఓ తల్లి పురుగుల మందు తాగిఆత్మహత్య చేసుకుంది..తుప్పతి చంద్రశేఖర్(32), నాగమణి దంపతుల కూతురు నవ్యశ్రీ (11) ఆరునెలలక్రితం విషజ్వరంతో మృతిచెందింది. అప్పటినుంచి చిన్నారిపై బెంగతో తల్లి డిప్రెషన్‌లో ఉండిపోయింది. బిడ్డ లేనిదే ఉండలేనంటూ పురుగులమందు తాగేసింది. కూతురు లేని లోటు, పురుగుల మందు తాగేసిన భార్య పరిస్థితిని తట్టుకోలేక భర్త చంద్రశేఖర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.. ప్రస్తుతం ఆ దంపతుల కుమారుడు నవదీప్ ఒంటరి వాడయ్యాడు.. ఆయన చనిపోయే ముందు తన స్నేహితుడికి ఫోన్‌చేసి తాను ఇక ఉండకపోవచ్చని, కుమారుడిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పినట్లు స్థానికులు తెలిపారు. అనుమానం వచ్చి గ్రామంలో వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో పొలంలో చెట్టుకు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆడపిల్లను పురిట్లోనే చంపేస్తున్న ఈ రోజుల్లో దూరమైన కూతురి కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కొణిజర్ల ప్రజలు కోరుతున్నారు. అక్కతో పాటు కనిపెంచిన అమ్మా, నాన్నలు కూడా దూరమైపోవడంతో అనాథ అయిన నవదీప్ బతుకు ఆగమ్యగోచరంగా మారింది. ఈ చిన్నారి పరిస్థితి ప్రతి ఒక్కరిని కదలిస్తుంది..కంట తడిపెట్టిస్తోంది. ఒంటరైన నవదీప్ భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది..అలాగే మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ నవదీప్‌కు సాయం చేయాల్సిందిగా దరువు.కామ్ విజ్ఞప్తి చేస్తోంది.