తమిళనటుడు విజయ్ ను అరెస్ట్ చేసారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇందులో వాస్తవం లేదు.. చెన్నైలో మూడు రోజులుగా సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరుగుతుండగా అలాగే విజయ్ ఇంట్లో కూడా జరిగాయి. ఈ సోదాల్లో నోట్ల కట్టలు బయటపడిన విషయం తెలిసిందే. అయితే ఈ సోదాల వ్యవహారం రాజకీయ రంగు పూసుకుంటోంది. నటుడు విజయ్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని ఇందుకే ప్రచారం జరుగుతోంది. కాగా కొన్ని రాజకీయ పార్టీల నాయకులు ఇప్పటికే విజయ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. అలాగే విజయ్ ఇంట్లో ఐటీ సోదాలకు బీజేపీనే కారణమనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో విజయ్ నటించిన మెర్శల్ చిత్రంలో ఉచిత వైద్యం, జీఎస్టీ వంటి సన్నివేశాల్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. అలాగే బిగిల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై కూడా విజయ్ అన్నాడీఎంకే నాయకులకు వార్నింగ్ ఇచ్చేవిధంగా మాట్లాడారు. తనను ఏమైనా చేయండని, తన అభిమానులపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు. అయితే తాజాగా విజయ్‌పై ఐటీ దాడులతో బీజేపీ, అన్నాడీఎంకే వ్యతిరేక పార్టీల నాయకులంతా విమర్శలు చేసుకుంటున్నారు. అభిమానులు మాత్రం విజయ్‌పై ఐటీ దాడులకు బీజేపీనే కారణం అని ఆరోపిస్తున్నారు.