చిన్నారులు, మహిళల రక్షణ కోసం దేశ చరిత్రలోనే తొలిసారిగా ‘దిశ’ చట్టం రూపొందించిన సీఎం శ్రీ వైయస్ జగన్, ఆ దిశలో మరో అడుగు ముందుకు వేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన దిశ ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను సీఎం శనివారం ప్రారంభించారు.
మహిళలు, చిన్నారుల రక్షణలో దిశ చట్టం అత్యంత ప్రత్యేకం అని, ఇది చరిత్రలో నిల్చి పోతుందని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. నేరస్తులకు వేగంగా శిక్ష పడాలని, అప్పుడే వ్యవస్థలో భయం ఏర్పడుతుందని, తద్వారా వ్యవస్థ బాగుపడుతుందని ఆయన చెప్పారు. చిన్నారులు, మహిళలపై నేరాల కేసుల విచారణకు మాత్రమే ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తున్నామని, 13 జిల్లాల్లో 13 మంది ప్రాసిక్యూటర్లను కూడా నియమిస్తున్నామని వెల్లడించారు. కొత్తగా విశాఖ, తిరుపతిలో రెండు ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే 18 దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు కానున్నాయని, దిశ పోలీసు స్టేషన్లలో 36 నుంచి 47 మంది సిబ్బంది పని చేస్తారని, వాటిలో మహిళలే ఎక్కువగా ఉంటారని ప్రకటించారు.
ఇంకా ఆపద సమయంలో ఎంతో ఆదుకునే దిశ ప్రత్యేక యాప్‌లో ఎస్ఓఎస్ బటన్ నొక్కగానే 10 సెకన్లలోనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందుతుందని, ఆడియో, వీడియో ట్రాన్స్మిషన్ అవుతుందని, దీంతో పోలీసులు వేగంగా వస్తారని ముఖ్యమంత్రి తెలిపారు. దిశ యాప్ డెమో స్వయంగా చూసిన సీఎం, దాని పనితీరును అభినందించారు.