ఏపీలోని ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ.. కియామోటార్స్ జగన్ సర్కార్ తీరు నచ్చక…తమిళనాడుకు తరలిపోతుంటూ ఆంగ్ల న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ రాసిన కథనంపై రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగుతోంది. అయితే కియా మోటార్స్ తమిళనాడుకు తరలిపోతుందంటూ రాయటర్స్లో వచ్చిన కథనాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. మంత్రి బుగ్గన, పరిశ్రమల శాఖ మంత్రి మేకతోటి గౌతంరెడ్డి రాయటర్స్ కథనంపై మండిపడ్డారు. కియా కార్ల ఫ్యాక్టరీని ఎక్కడకు తరలించడం లేదని…ఏపీలో మరింత విస్తరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రులు క్లారిటీ ఇచ్చారు. ఇక తమ సంస్థపై జరుగుతున్న ప్రచారాన్ని కియా మోటార్స్ కూడా ఖండించింది. దేశంలో తమ కంపెనీని విస్తరించాలనే చూస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ నుంచి తమ ప్లాంట్ను తరలించాలనే ఆలోచన తమకు లేదని కియా మోటార్స్ సంస్థ ప్రతినిధి మనోహర్ భగత్ స్పష్టం చేశారు.
కాగా కియా మోటార్స్ తరలింపు వార్తలపై వెంటనే అటు కియా మోటార్స్ సంస్థ ప్రతినిధులు, ఇటు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినా…టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ప్రెస్మీట్ పెట్టి మరీ ఏ క్యా కియా అంటూ కారాలు మిరియాలు నూరాడు. తాము కష్టపడి తెచ్చిన పరిశ్రమలను కూడా కాపాడుకోలేకపోతోందంటూ ప్రభుత్వంపై బాబు తెగ రెచ్చిపోయాడు. కియా ప్రతినిధులకు వేలు చూపించి.. బెదిరింపులకు పాల్పడింది వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలు కాదా? అని బాబు విమర్శలు చేశాడు.. పరిశ్రమలకు రాయితీలు కూడా ఇవ్వబోమని హెచ్చరిస్తే వారు ఇక్కడ ఎందుకుంటారంటూ…అడ్డగోలుగా వాదించాడు. కియా మోటార్స్ తరలిపోతుందంటూ లోలోపల ఆనందపడుతూనే…మరోవైపు ప్రభుత్వం తీరు వల్లే నేను కష్టపడి తెచ్చిన కియా మోటార్స్ తమిళనాడుకు తరలిపోతుందంటూ చంద్రబాబు గగ్గోలు పెట్టాడు.
అయితే తాజాగా కియా మోటార్స్ విషయంలో తమ రాష్ట్రం గురించి చంద్రబాబు అనుకుల మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తమిళనాడు ప్రభుత్వం కూడా ఖండించింది. కియా మోటార్స్ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోతుందని…ఈ మేరకు కియా సంస్థ ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు,,,,ఈ విషయాన్ని పళని సర్కారులోని ఓ ఉన్నతాధికారి స్వయంగా చెప్పినట్లుగా రాయిటర్స్లో కథనం ప్రచురితమైంది. వచ్చేవారం తమిళనాడు సెక్రటరీ స్థాయి సమావేశం కూడా ఉంటుందని రాయిటర్స్ తన కథనంలో రాసుకొచ్చింది. అయితే అలాంటిదేమీ లేదని.. తమను ఎవరూ సంప్రదించలేదని, తాము కూడా ఎవరితోను సమావేశం కాలేదని పళని సర్కార్ స్పష్టం చేసింది. అలాంటి ఓ పెద్ద ప్లాంట్ను మరోచోటికి మార్చడం కష్టమైన పని అని చెప్పింది. ఒకవేళ ప్లాంట్ విస్తరణ చేయాలని భావిస్తే.. అప్పుడు తమిళనాడులో ఒక ప్లాంట్ నెలకొల్పే అవకాశం ఉంటుందని పళని సర్కార్ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తాము సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు తమిళనాడు ప్రభుత్వం తేల్చిచెప్పింది. మొత్తంగా కియా మోటార్స్ తరలిపోతుందంటూ దుష్ప్రచారం చేసిన చంద్రబాబుకు, ఎల్లోమీడియాకు తమిళనాడు సర్కార్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.