విశ్వనగరం కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. భాగ్యనగర వాసుల కల సంపూర్ణమైంది. ఇవాళ జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ఎంజీబీఎస్(కారిడార్-2) వరకు మెట్రోరైలు మార్గాన్ని జేబీఎస్ స్టేషన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు మెట్రో ప్రారంభం అనంతరం సీఎం కేసీఆర్ ఎంజీబీఎస్ వరకు ప్రయాణించారు. ఎంజీబీఎస్ ఇంటర్ ఛేంజ్ మెట్రోస్టేషన్‌లో మెట్రో ఉన్నతాధికారులు, ఉద్యోగులు సీఎం కేసీఆర్‌తో ఫొటోలు దిగారు. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు 11 కి.మీ మార్గంలో మొత్తం 9 స్టేషన్లు ఉన్నాయి. జేబీఎస్ నుంచి బయలుదేరే మెట్రో రైలు-పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ వెస్ట్, న్యూ గాంధీ హాస్పటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్, మీదుగా ఎంజీబీఎస్ చేరుకుంటుంది. జేబీఎస్ నుంచి ఎల్‌బీనగర్ వెళ్లేవారు..ఎంజీబీఎస్ ఇంటర్‌ఛేంజ్ స్టేషన్‌లో దిగి మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వెళ్లే రైలు ద్వారా ప్రయాణించవచ్చు.
తొలి దశ మెట్రో ప్రాజెక్టులో ఇది చివరి దశ కావడంతో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఎంజీబీఎస్ స్టేషన్ నిర్మాణం పలు ప్రత్యేకతలతో నిర్మించారు. 58 పిల్లర్లు, 6 గ్రిడ్స్‌తో పూర్తిస్థాయి స్టీల్, నాణ్యమైన సిమెంట్ కాంక్రీట్‌తో స్టేషన్‌ను నిర్మించారు. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ మార్గంలో ప్రయాణించే కారిడార్-1కు సంబంధించిన రైళ్ల రాకపోకలు ఇంటర్‌ఛేంజ్ మెట్రోస్టేషన్ కింది అంతస్తుల ద్వారా ప్రయాణించగా, కారిడార్2 జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా మార్గంలో సాగించే రైలు పైఅంతస్తుల ద్వారా రాకపోకలు సాగిస్తాయి. ఐతే ఒక మార్గం నుంచి మరో మార్గం మారడానికి సులభమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రాబోయే 100 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా నిర్మించారు. రిటైల్ అవుట్‌లెట్లు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్స్ , కన్వీయెన్స్ అవుట్‌లెట్స్‌ను కాంకర్స్ లెవెల్‌లో నిర్మించారు. మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులో ప్రతిపాదించిన 72 కి.మీ మార్గంలో 69కి.మీ మేర మెట్రో సేవలు శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్ మెట్రో దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో కారిడార్‌గా నిలిచింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ప్రభుత్వ, మెట్రో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.