తెనాలి సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వంపై చేసిన విమర్శలపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య మండిపడ్డారు. చంద్రబాబు ప్రజల మద్దతు ఉన్న నాయకుడు కాదని విమర్శించారు. అసలు ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసే సత్తా చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. సొంత ప్రయోజనాలకోసమే అమరావతిపై కృత్రిమ ఉద్యమం మొదలు పెట్టారని విమర్శించారు. రాజధాని అంశంపై చంద్రబాబు చెప్పినట్టే నడుచుకోవాలనే రూల్ ఉందా..? అని ప్రశ్నించారు.
కాగా అమరావతిని కేంద్రం రాజధానిగా గుర్తించిందని..అలాంటప్పుడు రాజధానిని అమరావతి నుంచి ఎలా తరలిస్తారంటూ చంద్రబాబు చేస్తున్న వాదనను రామచంద్రయ్య తిప్పికొట్టారు.రాజధానిపై రాష్ట్రానిదే తుది నిర్ణయమని కేంద్రం స్పష్టం చేసిందని, చంద్రబాబు అండ్ కో చెప్పేదంతా అబద్ధమని తేలిపోయిందని రామచంద్రయ్య స్పష్టం చేశారు. చంద్రబాబు తన వారికోసమే ఉద్యమం చేయిస్తున్నాడని…. కొంత మంది పెయిడ్ లీడర్లను తయారుచేసి తిప్పుతున్నాడని ఫైర్ అయ్యారు. ఇక మూడు రాజధానులపై రెఫరెండం పెట్టాలని చంద్రబాబు చేసిన డిమాండ్‌పై రామచంద్రయ్య స్పందించారు. అసలు నీ పాలనలో ఒకసారైనా రిఫరెండం పెట్టావా చంద్రబాబు అని ప్రశ్నించారు. అయినా లోకేష్ ఓడిపోయాక రిఫరెండం ఎందుకు..? అంటూ సెటైర్ వేశారు. చంద్రబాబుకు అవసరమైనప్పుడల్లా రిఫరెండం పెట్టాలా… ఆయన మాటలు విని మోసపోవద్దు. ఇప్పటికైనా దీక్ష విరమించాలని రామచంద్రయ్య అమరావతి రైతులకు సూచించారు.
అలాగే సీఎం జగన్‌ను పదేపదే తుగ్లక్ అంటూ కించపరుస్తున్న చంద్రబాబుపై రామచంద్రయ్య విరుచుకుపడ్డారు. హైదరాబాద్ నుంచి రాత్రికి రాత్రే అమరావతికి పరిగెత్తి వచ్చిన తుగ్లక్ ఎవరు.. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను అమలు చేయని తుగ్లక్ ఎవరు… నాలుగు పంటలు పండే భూముల్లో రాజధాని పెట్టిన పెద్ద తుగ్లక్ ఎవరు..అంటూ చంద్రబాబుకు గట్టి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు చేసిన అవినీతికి తప్పకుండా జైలుకు వెళ్తారని…. బీజేపీలోకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పంపినా జైలుకు వెళ్లడం తప్పదని రామచంద్రయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు చచ్చిన పాము… టీడీపీ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ…టీడీపీకి సమాధి కట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటూ సి. రామచంద్రయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు.