సంపదను సృష్టించడం, ప్రజలకు పంచడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నది. సంపద గణనీయంగా పెరుగుతున్నప్పటికీ పరిమితికి లోబడి అప్పులు తీసుకుని ఆర్థిక క్రమశిక్షణను కట్టుతప్పకుండా పాటిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ ముందువరుసలో నిలిచింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెస్తున్న అప్పుల గురించి విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని, అతితక్కువ అప్పులు తీసుకున్న రాష్ర్టాల్లో మహారాష్ట్ర మినహా మిగిలిన అన్ని రాష్ర్టాలు తెలంగాణ తర్వాతే ఉన్నాయని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ సాక్షిగా ప్రశంసించింది. దీంతో తెలంగాణ సంపద ఎక్కువ, అప్పులు తక్కువన్న విషయం మరోసారి స్పష్టమైంది.
రాష్ట్ర సంపదను గణనీయంగా పెంచుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. అప్పుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నది. అడ్డదిడ్డంగా అప్పులు తీసుకోకుండా అత్యవసరాలకు, మరింత సంపద సృష్టికి మాత్రమే రుణాలు తీసుకుంటున్నది. జీఎస్డీపీ (గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్)లో అధికారికంగా 25 శాతం వరకు రుణాలు తీసుకునే అవకాశమున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2019-20) వార్షిక బడ్జెట్ అంచనాల్లో ఈ రుణాలను 21.39 శాతానికే పరిమితం చేసింది. వాస్తవానికి ఇది కేవలం 17 శాతంలోపే ఉండవచ్చని రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) తన తాజా అంచనాల్లో వెల్లడించినట్టు నరేంద్రమోదీ సర్కార్ ధ్రువీకరించింది. రాష్ర్టాల ఆర్థిక పరిస్థితిని కేంద్ర ఆర్థికశాఖతోపాటు ఆర్బీఐ, ఆర్థిక సంఘం, కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ బ్యూరో ఎప్పటికప్పుడు విశ్లేషించి ఎంత వడ్డీతో ఏమేరకు అప్పులు తీసుకోవచ్చో నిర్ధారిస్తుంటాయి. పరిమితికి మించి రుణాలు తీసుకుంటే ఆర్థికంగా ఆంక్షలు విధిస్తాయి. వాస్తవానికి రాష్ర్టాలు తీసుకునే అప్పులు జీఎస్డీపీలో 25 శాతంలోపే ఉండాలి. కానీ తెలంగాణ సహా కొన్ని రాష్ర్టాలు మాత్రమే దీన్ని పాటిస్తున్నాయి. అనేక రాష్ర్టాలు ఎఫ్‌ఆర్‌బీఎం (ఫిస్కల్ రెస్సాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్) పరిమితిని దాటి రుణాలు తీసు కుంటున్నాయి.
ఏపీ అప్పులు జీఎస్డీపీలో 31.6 శాతం
———————————————————
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన గణాంకాల ప్రకారం జీఎస్డీపీలో ఏపీ 31.6 శాతం అప్పులు తీసుకోగా.. అరుణాచల్‌ప్రదేశ్ 35 శాతం, బీహార్, 32.4 శాతం, ఉత్తరప్రదేశ్ 38.1 శాతం, ఉత్తరాఖండ్ 24.6 శాతం, పశ్చిమబెంగాల్ 32.6 శాతం, ఛత్తీస్‌గఢ్ 23.7 శాతం, గుజరాత్ 19.2 శాతం, హర్యానా 26.3 శాతం, హిమాచల్‌ప్రదేశ్ 34.9 శాతం, జమ్ముకశ్మీర్ 48.2 శాతం, జార్ఖండ్ 26 శాతం, కేరళ 30.8 శాతం, మధ్యప్రదేశ్ 25.4 శాతం, మణిపూర్ 38.1 శాతం, మేఘాలయ 33 శాతం, మిజోరం 31.6 శాతం, నాగాలాండ్ 38.4 శాతం, ఒడిశా 24.7 శాతం, పంజాబ్ 39.9 శాతం, సిక్కిం 25.1 శాతం, తమిళనాడు 21.7 శాతం, పుదుచ్చేరి 20 శాతం, కర్ణాటక 18.7 శాతం, అసోం 18.9 శాతం, మహారాష్ట్ర 16.9 శాతం అప్పులు చేశాయి. కేంద్ర ప్రభుత్వ అప్పులు సైతం జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)లో 48 శాతంగా ఉండటం గమనార్హం.
25 ఏండ్లు నామమాత్రపు వడ్డీ చెల్లిస్తే చాలు
———————————————————
ప్రాజెక్టులు, ఇతర అవసరాలకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అప్పులను తీర్చేందుకు మరో 25 ఏండ్ల సమయం ఉన్నది. అప్పటివరకు నామమాత్రపు వడ్డీని మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా రెవెన్యూ ఖర్చుల్లో 10 శాతం మించకుండా జాగ్రత్త పడుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. రాష్ట్రంలో మరింత సంపదను సృష్టించేందుకు ఎక్కువగా పెట్టుబడి వ్యయం చేస్తున్నది. ద్రవ్యలోటును అత్యంత సమర్థంగా నియంత్రిస్తున్న రాష్ర్టాల జాబితాలో కూడా తెలంగాణ ముందువరుసలో ఉన్నది. వాస్తవానికి ద్రవ్యలోటు మొత్తం జీఎస్డీపీలో 3 నుంచి 3.5 శాతం వరకు ఉండవచ్చు. కానీ తెలంగాణ ప్రభుత్వం దీన్ని జీఎస్డీపీ (రూ.8,65,688 కోట్ల)లో 2.53 శాతానికే (రూ.24,081 కోట్లకే) కట్టడి చేసింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ జీఎస్డీపీ కేవలం రూ.4 లక్షల కోట్లే. ఇది దేశ సంపద (జీడీపీ)లో 4.04 శాతం మాత్రమే. కానీ టీఆర్‌ఎస్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్ర సంపద శరవేగంగా పెరిగి ఐదేండ్లలోనే రెట్టింపైంది. ప్రస్తుత ధరల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సంపద రూ.8.66 లక్షల కోట్లకు పెరిగి దేశ సంపదలో 4.55 శాతానికి చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.9,50,000 కోట్లు దాటవచ్చని ప్రాథమిక అంచనా.
విపక్షాలు కండ్లు తెరవాలి: కేటీఆర్
———————————————————
తెలంగాణ ప్రభుత్వం పరిమితికి లోబడి అప్పులు తీసుకుంటున్నట్లు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని అప్పులకుప్పగా మారుస్తున్నదని తప్పుడు ప్రచారం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటికైనా కండ్లు తెరవాలని సూచించారు. ఈ విషయంలో ఆ రెండు పార్టీల నేతలు అవగాహన పెంచుకోవాల్సిన అవసరమున్నదని ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి లోబడి రుణాలు తీసుకొంటున్నట్టు కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో మరోసారి రుజువయిందని, రాష్ట్రం పట్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని ఈ ప్రకటన నిరూపిస్తున్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.