ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు గత 50 రోజులుగా అమరావతి ప్రాంత రైతులతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయిస్తున్న సంగతి తెలిసిందే. శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును చంద్రబాబు కుట్రపూరితంగా సెలెక్ట్ కమిటీకి పంపించడంతో ఆగ్రహించిన జగన్ సర్కార్ ఏకంగా కౌన్సిల్‌ను రద్దు చేసింది. శాసనమండలి రద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపించింది. కాగా కేంద్రప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఉభయసభల్లో ఆమోదించిన మరుక్షణం ఏపీ శాసనమండలి అధికారికంగా రద్దు అయిపోతుంది. ఈ నేపథ్యంలో కేంద్రం శాసనమండలి రద్దు అనేది రాష్ట్రం పరిధిలోని అంశం అని కేంద్రం స్పష్టం చేసింది. అయితే అమరావతిని రాజధానిగా నోటిఫై చేశామని కూడా కేంద్రం చెప్పింది. దీంతో ప్రతిపక్ష టీడీపీ కేంద్రం కూడా రాజధానిగా అమరావతిని గుర్తించింది..అలాంటప్పుడు రాజధానిని ఎలా మారుస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. కాగా మూడు రాజధానుల ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశం..తమకు సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయాన్ని టీడీపీ నేతలు పక్కనపెడుతున్నారు.
అయితే తాజాగా మూడు రాజధానుల వ్యవహారంపై ప్రముఖ దళిత ప్రొఫెసర్ కంచె ఐలయ్య స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉండాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయమని కంచె ఐలయ్య తెలిపారు. రాజధానిని విభజించే హక్కు ముఖ్యమంత్రికి ఉందని స్పష్టం చేశారు. అయితే ఇదే సమయంలో అమరావతి రైతులకు నష్టం లేకుండా చూడాలని ఐలయ్య సీఎం జగన్‌ను కోరారు. భూములు కావాలన్న వారికి భూములు ఇవ్వాలని, రైతులకు ఇస్తానన్న పరిహారం 15 ఏళ్ల పాటు రూ. 50 వేల చొప్పున ఇవ్వాలని సూచించారు. ఇక రాజధాని కోసం సేకరించిన వేల ఎకరాలు ఇప్పటికీ ముట్టుకోకుండా ఉన్నాయని ఆక్షేపించారు. గత ఐదేళ్లలో చంద్రబాబు దళిత రైతుల భూములను కొల్లగొట్టి తన సామాజికవర్గానికి దోచిపెట్టారని కంచె ఐలయ్య ఆరోపించారు. మరో 20 ఏళ్లు అయిన చంద్రబాబు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేడని తీవ్ర విమర్శలు చేశారు. మొత్తంగా చంద్రబాబు తన సామాజికవర్గం కోసం అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తున్నాడని ఆరోపణలు వస్తున్న వేళ.. మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో సీఎం జగన్‌కు దళిత ప్రొఫెసర్..కంచె ఐలయ్య మద్దతు పలకడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.