ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు గత 50 రోజులుగా రాజధాని ప్రాంత రైతులను రెచ్చగొట్టి పెద్ద ఎత్తున ఆందోళనలు చేయిస్తున్నాడు. అమరావతి ఆందోళనలను రాష్ట్ర స్థాయిగా మల్చేందుకు చంద్రబాబు ఆడని డ్రామా లేదు… అమరావతి జేఏసీని ఏర్పాటు చేసి ఉద్యమం కోసమని స్వయంగా జోలెపట్టి అడుక్కుని విరాళాలు సేకరించాడు..అయినా ఉత్తరాంధ్ర, రాయలసీమలో అమరావతి ఉద్యమానికి పెద్దగా స్పందన రాలేదు. మరోవైపు శాసనమండలి రద్దుతో చంద్రబాబు అమరావతి రైతుల వంక చూడడం లేదు. దీంతో తీవ్ర విమర్శలు రావడంతో మళ్లీ తెనాలిలో అమరావతి సభ నిర్వహించాడు. అయితే రాజధాని పేరుతో టీడీపీ చేస్తున్న కృత్రిమ ఉద్యమానికి జనం మద్దతు లేదని మరోసారి స్పష్టం అయింది.
అమరావతి జేఏసీ పేరిట తెనాలిలో నిర్వహించిన సభ జనం లేక అట్టర్‌ప్లాప్ అయింది. ఈ సభకు 20 వేల మందిని సమీకరించాలని చంద్రబాబు నాయుడు ఆదేశించినప్పటికీ.. కేవలం 2వేల మంది కూడా హాజరుకాలేదు. జనం లేకపోవడంతో టీడీపీ నేతలు సభను ఆలస్యంగా ప్రారంభించారు. మధ్యాహ్నం 3 గంటలకు జరపాల్సిన సభను.. చివరకు రాత్రి 8 గంటల సమయంలో నిర్వహించారు. అయితే వచ్చిన కొద్ది మంది కూడా మధ్యలోనే వెళ్లిపోవడంతో సభ వెలవెలబోయింది. చంద్రబాబు ఎంతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా కూడా ఎవరు పట్టించుకోలేదు. దీంతో ఆయన ప్రసంగిస్తున్న సమయానికి సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఇంకేముంది..చంద్రబాబు తన బాధను, ఆక్రోశాన్ని ఖాళీ కుర్చీలకే చెప్పుకోవాల్సి వచ్చింది. అంతకు ముందు లోకేష్ మాట్లాడుతుండగా కూడా ప్రజలు లేచి వెళ్లిపోయారు. ఈ సభ కోసం మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ టీడీపీ నాయకులు వారం రోజులుగా జనసమీకరణ కోసం ప్రయత్నించారు. జిల్లా నుంచే కాకుండా కనీసం తెనాలి నుంచి కూడా జనాలను తరలించలేకపోయారు. తెనాలి జిల్లాలోని పలు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలు కూడా ఈ సభకు హాజరుకాకపోవడం గమనార్హం అయితే సభ విఫలం కావడంపై చంద్రబాబు జిల్లా టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అమరావతి పేరిట రాద్ధాంతం చేస్తున్న చంద్రబాబుకు తెనాలి సభ అట్టర్ ఫ్లాప్ అవ్వడం గట్టి షాక్ ఇచ్చినట్లైంది.