వెనుకబడిన రాయలసీమలో ప్రతిభావంతులకు కొదువలేదు..ఎంతో మంది పేదరికం వల్ల తమ ప్రతిభకు ప్రోత్సాహం లేక వెనుకబడి పోతున్నారు. అయితే ప్రతిభావంతులైన నిరుపేద యువతను గుర్తించి..వారికి సాయం చేసి చేయూతనందించడంలో వైసీపీ నేతలు ముందు వరుసలో ఉంటారు. తాజాగా నిరుపేద ఔత్సాహిక పర్వతారోహకుడికి వైసీపీ నేత అమర్‌నాథ్ రెడ్డి ప్రోత్సాహం అందించారు. కర్నూలు జిల్లాలో తుగ్గలి మండలం రోళ్లపాడు గ్రామానికి చెందిన పి. సురేష్ నాయక్ ఔత్సాహిక పర్వతారోహకుడు. ట్రెక్కింగ్‌లో అసాధారణ ప్రతిభ ఉన్న సురేష్ నాయక్…పేదరికం వల్ల వెనకబడి పోతున్నాడు. తాజాగా ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించే అవకాశం సురేష్ నాయక్‌కు వచ్చింది. అయితే ఆర్థిక ఇబ్బందులతో ఆఫ్రికా వెళ్లడానికి సురేష్ పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న వైసీపీ నేత అమర్‌నాథ్ వెంటనే రూ. 50 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించేందుకుగాను ఆఫ్రికా వెళ్లేందుకు తగిన సహాయసహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా సురేష్‌నాయక్‌కు అమర్‌నాథ్ రెడ్డి హామీ ఇచ్చారు. మొత్తంగా నిరుపేద యువకుడి ప్రతిభను గుర్తించి..ఆర్థిక సాయం అందించిన వైసీపీ నేత అమర్‌నాథ్ రెడ్డిని జిల్లావాసులు అభినందిస్తున్నారు.
