తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు త్వరితగతిన అందే విధంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాసయాదవ్ ఆదేశించారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్థకశాఖ డైరెక్టర్ కార్యాలయంలోని చాంబర్ లో మంత్రి శ్రీనివాసయాదవ్ ను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్వేతమహంతి మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పేదప్రజల సంక్షేమంకోసం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను అమలు చేస్తుందని, వాటిని సాధ్యమైనంత త్వరగా ధరఖాస్తుల పరిశీలనను పూర్తిచేసి లబ్ధిదారులకు వెంటనే చెక్కులు అందేవిధంగా కృషి చేయాలని ఆయన వివరించారు.
ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మదిలోంచి పుట్టిన మానసపుత్రిక అయినటువంటి ఈ పథకాన్ని ఎంతో పటిష్టంగా అమలు చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల హాజరు, ఫలితాలు తగ్గుముఖం పడుతున్నాయని, వాటి పట్ల సమగ్రమైన నివేదికను రూపొందించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. అంగన్‌వాడి పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు తీరుతెన్నులను పరిశీలించాలని, అవసరమైన ప్రాంతాలలో మరిన్ని అంగన్ వాడీలను ప్రారంభించి పేద ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు. నగరంలో ప్రభుత్వ భూములకు సంబంధించిన రికార్డులను సమగ్రంగా రూపొందించి ల్యాండ్ బ్యాంక్ నివేదికను రూపొందించాలని ఆయన సూచించారు.
అంతేకాకుండా ప్రభుత్వ భూములపై కోర్టు పరిధిలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి వాటి పరిరక్షణకు ప్రభుత్వం తరపున అవసరమైన కఠిన చర్యలను వెంటనే తీసుకోవాలని ఆయన సూచించారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని, అవసరమైతే ప్రత్యేక న్యాయవాదులను నియమించుకొని కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడటంలో తనవంతు కృషి చేయాలని ఆయన కోరారు. పేద ప్రజలకు అందిస్తున్నటువంటి పెన్షన్ల పెండింగ్ ధరఖాస్తులను ఆయా మండలాల వారిగా నివేదికలను తెప్పించుకొని వాటిని త్వరితగతిన మంజూరు చేయాలని తనను మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్ శ్వేతామహంతిని మంత్రి కోరారు.