తాడిపత్రిలో మూడు దశాబ్దాలకు పైగా సాగిన జేసీ బ్రదర్స్ హవాకు ఈసారి వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి గండి కొట్టారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తాడిపత్రిలో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు అశ్మిత్‌రెడ్డిపై సంచలన విజయం సాధించారు. ఇక అనంతపురం లోక్‌సభ ఎన్నికలలో జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ ప్రభాకర్ రెడ్డి పరాజయం పాలయ్యారు. దీంతో తాడిపత్రితో పాటు జిల్లాలో తొలిసారిగా జేసీ కుటుంబం ప్రాభవం కోల్పోయింది. ఎన్నికల తర్వాత జేసీ బ్రదర్స్ రాజకీయంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 30 ఏళ్లుగా అధికారాన్ని అడ్డంపెట్టకుని జిల్లాలో జేసీ బ్రదర్స్ చేసిన అవినీతి, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తొలుత నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న జేసీ దివాకర్ ట్రావెల్స్ చెందిన 80 బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. రీసెంట్‌గా జేసీ బ్రదర్స్‌కు చెందిన ‘ త్రిశూల్ సిమెంట్’ కంపెనీ లీజును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో పాటు..లీజు ప్రాంతం నుంచి 38 వేల 212 మెట్రిక్ టన్నుల సున్నపు రాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వితీయటం, రవాణా చేయటంపై విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. దీంతో జేసీ దివాకర్ రెడ్డి సీఎం జగన్ ఫ్యాక్షనిస్టుగా వ్యవహరిస్తున్నాడని…తన ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు.
అయితే తాజాగా యాడికి మండలం కోన ఉప్పలపాడులో త్రిశూల్ ఫ్యాక్టరీ భూములను అఖిలపక్ష నేతలతో కలిసి పరిశీలించిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ సందర్భంగా జేసీ బ్రదర్స్‌పై మండిపడ్డారు. త్రిశూల్ సిమెంట్స్ అనుమతుల రద్దును స్వాగతిస్తున్నామని కేతిరెడ్డి అన్నారు. త్రిశూల్ సిమెంట్స్ పేరుతో జేసీ దివాకర్‌రెడ్డి మోసం చేశారని, పరిశ్రమ స్థాపించి ఉద్యోగాలు కల్పించకుండా … రూ.200 కోట్ల విలువైన సున్నపురాయి గనులను జేసీ కొల్లగొట్టారని కేతిరెడ్డి ఆరోపించారు. జేసీ బ్రదర్స్ దొంగల కన్నా హీనమని ఫైర్ అయ్యారు. తక్షణమే త్రిశూల్ సిమెంట్ స్కామ్ వ్యవహారంలో జేసీ దివాకర్‌రెడ్డిపై బినామి చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని పెద్దారెడ్డి డిమాండ్ చేశారు. మొత్తంగా త్రిశూల్ స్కామ్‌తో జేసీ బ్రదర్స్ రాజకీయం జీవితానికి పుల్‌స్టాప్ పడినట్లే అని అనంతపురం జిల్లాలో చర్చ జరుగుతోంది.