టీడీపీ అధినేత చంద్రబాబుపై తూటాల్లాంటి ప్రశ్నలతో ఏపీ మంత్రి పేర్నినాని విరుచుకుపడ్డారు. తాజాగా చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పరిపాలనా వికేంద్రీకరణ వల్లనో…ప్రభుత్వ కార్యాలయాలు తరలిస్తేనో అభివృద్ధి జరగదు అని చంద్రబాబు సెలవిచ్చారు. ప్రభుత్వ తీరు వల్ల సింగపూర్ కంపెనీలు వెనక్కిపోయాయని విమర్శించారు. ఎవరిచ్చారు మీకు అధికారం…అంటూ షరామామూలుగా ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కారు. చంద్రబాబు విమర్శలపై మంత్రి పేర్ని నాని మండిపడ్డారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రెస్‌మీట్ చూస్తే ఆయన జీవితంలో మారడని, ఏపీ బాగుపడడం ఆయనకు ఇష్టం లేదని మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఎనిమిది నెలలుగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు 90 శాతం కుటుంబాలు సంతోషంగా ఉన్నాయన్నారు. ఇక్కడి ప్రజల మనోభావాలతో పని లేకుండా తాను మేనేజ్ చేసుకున్న జాతీయ మీడియా ఏమనుకుంటోందంటూ… తోక పత్రికలు ఏరుకుని వచ్చిన వార్తలను చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో చదివి వినిపించారని ఫైర్ అయ్యారు. ఇక మూడు రాజధానులు ఫెయిల్ అయ్యాయంటూ దక్షిణాఫ్రికాకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించిన వీడియోలపై మంత్రి పేర్నినాని సెటైర్లు వేశారు. చంద్రబాబు ప్రదర్శించిన వీడియోల్లో రేవంత్‌రెడ్డి తెలంగాణలో డబ్బుల మూట ఇస్తూ పట్టుబడిన దృశ్యాలు, ‘బ్రీఫ్డ్‌మీ…’ అనే ఆడియోను కూడా ప్రదర్శించి ఉంటే మరింత బాగుండేవని ఎద్దేవా చేశారు చంద్రబాబు దుర్మార్గాలపై రాష్ట్ర ప్రజలను మాట్లాడిస్తే ప్రపంచంలో ఉన్న మొత్తం స్టోరేజీ డివైస్‌లు సరిపోవని ఎద్దేవా చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబుపై మంత్రి నాని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. ‘అమరావతిలో ఐదేళ్లలో ఏం కట్టారంటే..? చంద్రబాబు మాట్లాడరు… మూడు ప్రాంతాలకూ మీరు చేసిన వాగ్దానాలు ఎందుకు అమలు చేయలేదంటే..? స్పందించరు. ప్రజలకు ఎందుకు అన్యాయం చేశారంటే..? మాట్లాడరు. నిజంగా అమరావతిని అభివృద్ధి చేస్తే తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో ఎందుకు ఓడారంటే..? మాట్లాడరు. కనీసం ల్యాండ్ పూలింగ్ ఏరియాలో డ్రైనేజీ వ్యవస్థనైనా ఏర్పాటు చేయగలిగారా? అంటే నోరెత్తరు’…దమ్ముంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పు అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయటం అవసరం అని సీఎం జగన్ అంటే.. బాబు వ్యతిరేకిస్తున్నాడని మండిపడ్డారు. అభివృద్ధి చెందిన నగరంలో సచివాలయం ఉంటే మౌలిక సదుపాయాలకు పెట్టుబడుల అవసరం ఉండదని శంఖం ఊదుతున్నా ఆయనకు వినిపించడం లేదని మంత్రి పేర్నినాని ధ్వజమెత్తారు. మొత్తంగా వరుస ప్రశ్నలతో చంద్రబాబు విమర్శలకు మంత్రి పేర్ని నాని ధీటైన కౌంటర్ ఇచ్చారు.