సరిలేరు నీకెవ్వరు సినిమా ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి ఓ మాట చెప్పారు.. రాజకీయం …శత్రుత్వాన్ని పెంచుతోంది. సినిమా పరిశ్రమ స్నేహాన్ని, ప్రేమను పెంచుతోంది అని..నిజమే..రాజకీయం ఎప్పుడూ శత్రువులను తయారు చేస్తుంది…సినిమా అభిమానం రాజకీయ శత్రువులను ఒక్క దగ్గరకు చేరుస్తుంది. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన ఘటనలో రాజకీయం వేరు..సినిమా అభిమానం వేరు అని నిరూపించారు..మంత్రి పేర్ని నాని. వైసీపీలో కీలక నేతగా, రాష్ట్రమంత్రిగా పేర్ని నాని తమ నాయకుడు జగన్‌పై, తమ పార్టీపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసే విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇస్తుంటారు. ఒక్కోసారి పవన్‌పై పరుష పదజాలంతో కూడా విరుచుకుపడుతుంటారు.
అయితే తాజాగా మచిలీపట్నంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు దాసరి లక్ష్మణరావు (బుడ్డా)హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. కాగా లక్ష్మణ్‌రావుకు అత్యంత సన్నిహితుడైన సుధా ఫోటో స్టూడియో ఓనన్ సుధాకర్ ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తన మిత్రుడి మరణంతో కలత చెందిన లక్ష్మణరావు కొద్ది రోజులుగా మానసిక వేదనకు గురయ్యారు. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటు రాగా..కుటుంబసభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది.. లక్ష్మణరావు మరణవార్త విని కలత చెందిన మంత్రి పేర్ని నాని.. వెంటనే ఆయన ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామార్శించారు. స్వయంగా లక్ష్మణరావు అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు. ఏపీ మంత్రి పేర్నినానితో పాటు మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర కూడా లక్ష్మణరావు పాడె మోయడం గమనార్హం. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ చనిపోతే వైసీపీ, టీడీపీ నేతలు పార్టీలకతీతంగా పాడెమోసిన ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రాజకీయం మిత్రులను శత్రువులను చేస్తుంటే..మానవత్వం రాజకీయ శత్రువులను ఒక్క దగ్గర చేస్తుందని ఈఘటన నిరూపించింది.