టీడీపీ అధినేత చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె.. బాబుగారి ఇంటిపేరుతోనే ఆ ఊరు నారావారి పల్లెగా మారిపోయింది. ఇంట గెలిచి..రచ్చ గెలవాలంటారు…అదేమి చిత్రమో కాని…40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసినా చంద్రబాబు తన సొంతూరుకు పెద్దగా ఒరగబెట్టిందేం లేదు…ఇప్పటికీ అనేక సమస్యలతో నారావారిపల్లె ప్రజలు సతమతమవుతున్నారు. ఏదో సంక్రాంతి పండుగ నాడు చంద్రబాబు ఫ్యామిలీతో సహా సొంతూరుకు వెళ్లి ఆ మూడు రోజులు హడావుడి చేయడం తప్పా..మిగిలిన రోజుల్లో పెద్దగా పట్టించుకున్నది లేదు. అందుకేనేమో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా నారావారిపల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి వరుసగా గెలుస్తున్నారు. ఇక ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా చంద్రబాబు అమరావతి రైతులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయించాడు.
అయితే శాసనమండలి రద్దు తర్వాత చంద్రబాబు అమరావతి ఉద్యమాన్ని పక్కనపెట్టి పార్టీ కార్యక్రమాలకే పరిమితం అవుతున్నాడు. వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో అడ్డుకున్న చంద్రబాబుకు చెక్‌పెట్టేందుకు ఆయన సొంత ఊరిలోనే మూడు రాజధానులకు అనుకూలంగా భారీ సభను వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి నిర్వహించారు. ఫిబ్రవరి 2 వ తేదీన జరిగిన ఈ సభకు పార్టీ శ్రేణులతో పాటు పాతికవేలకుపైగా ప్రజలు తరలివచ్చారు. చంద్రబాబు సొంతూరు జై జగన్, జయహో జగనన్న నినాదాలతో మార్మోగిపోయింది. సీఎం జగన్ హాజరు కాని సభకు కూడా ఇన్ని వేల మంది హాజరు కావడమే కాకుండా సభలో వైసీపీ నేతల ప్రసంగాలకు వచ్చిన స్పందన చూస్తే నిజంగా చంద్రబాబుకు బీపీ పెరగడం ఖాయం.
వికేంద్రీకరణ సభ సందర్భంగా నారావారిపల్లె ఊరు ప్రారంభం నుంచి సభాప్రాంగణం వరకు ఏర్పాటు చేసిన వైసీపీ ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో నారావారి పల్లె కళకళలాడింది. రోడ్డుకిరువైపులా మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం. సభ సందర్భంగా నారావారిపల్లెను చూసి..చంద్రబాబు సొంతూరేంటీ…ఇలా ఉందని అందరూ మాట్లాడుకోవడం కనిపించింది. 40 ఇయర్ప్ ఇండస్ట్రీ, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు అత్తగారిల్లైన కృష్ణా జిల్లాపై చూపించే ప్రేమ..సొంతూరుపై ఎందుకు చూపించలేదని సభకు వచ్చిన వారంతా డిస్కషన్ చేసుకున్నారంట. చంద్రబాబు సొంతూరులో చెవిరెడ్డి నిర్వహించిన మూడు రాజధానుల సభ గ్రాండ్ సక్సెస్ కావడం తెలుగు తమ్ముళ్లకు చెమటలు పట్టేలా చేసింది…మరోవైపు తన సొంతూరైన నారావారిపల్లె మూడురాజధానులకు జై కొట్టడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నాడు. మొత్తంగా కన్న తల్లి లాంటి ఊరిని నిర్లక్ష్యం చేసి ఇల్లరికం అల్లుడిలా అమరావతి పాట పాడుతున్న బాబుకు నారావారిపల్లె ప్రజలు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారనే చెప్పాలి. అందుకే ఇంట గెలిచి రచ్చ గెలవాలని పెద్దలు ఊరకనే చెప్పలేదు.